Ad Code

రికార్డ్ సృష్టించిన తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ : ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ప్రయాణికుల సంఖ్య 11 లక్షలు దాటే అవకాశం !


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి రేణిగుంట విమానాశ్రయం కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య బాగా పెరుగుతున్న క్రమంలో తిరుపతి ఎయిర్ పోర్ట్ ప్రయాణికులకు విస్తృతంగా సేవలు అందిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే పర్యాటకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు, ఇతర పనులతో వచ్చే వారితో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ బిజీగా ఉంటుంది. అత్యధిక సంఖ్యలో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2025- 26 జనవరి వరకు తిరుపతి విమానాశ్రయం ద్వారా ఏకంగా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో ఎక్కువమంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు కాగా, ఈ విమానాశ్రయంలో మరిన్ని విమాన సేవలను పెంచాలని కూడా ఏవియేషన్ శాఖ భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో తిరుమల శ్రీవారిని 9.9 లక్షల మంది ప్రయాణికులు దర్శించుకుంటే ఈ ఏడాది ఆ సంఖ్య ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 11లక్షలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. విమానయాన సంస్థలు 72 సీట్ల చిన్న విమానాల స్థానంలో, ప్రస్తుతం 230 సీట్ల పెద్ద ఎయిర్ బస్సులను నడుపుతున్నాయి. ప్రతిరోజు తిరుపతికి 16 విమాన సర్వీసులు ఉదయం నుండి సాయంత్రం వరకు నడుస్తున్నాయి. ఇవి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఇక ఇదే సమయంలో టిటిడి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి టికెట్లు జారీ చేస్తున్న కారణంగా కూడా ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. నెలకు దాదాపు లక్ష మందికి పైగా ప్రయాణికుల అంచనాలతో ఎయిర్‌పోర్ట్‌ పరిసరాలలో కీలక అభివృద్ధి పనులు చేయనున్నారు. హోటల్స్, రెస్టారెంట్లు వంటి వాటిని ఏర్పాటు చేసి తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించడం కోసం ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా దక్షిణాదిలో తిరుపతి విమానాశ్రయం అతి పెద్ద రన్ వేతో ఉన్న ఎయిర్ పోర్ట్. హైదరాబాదు లోని రన్ వేల కంటే తిరుపతి రన్ వే చాలా విశాలమైనది. అటువంటి తిరుపతి విమానాశ్రయాన్ని భవిష్యత్తులో మరిన్ని దేశీయ, విదేశీ విమానాలను నడపడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu