Ad Code

చింతలపూడి, రేచర్ల బొగ్గు బ్లాకులను వేలంలో దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా చింతలపూడి, రేచర్ల బొగ్గు బ్లాకుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు రూ.లక్ష కోట్ల భారీ పెట్టుబడితో ప్రాజెక్టును నెలకొల్పేందుకు సిద్ధమైంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన వాణిజ్య బొగ్గు గనుల వేలంలో భాగంగా రిలయన్స్ ఈ బ్లాకులను సొంతం చేసుకుంది. అందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏపీలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవలే రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయి, ఈ ప్రాజెక్ట్ కార్యాచరణను వివరించారు. చింతలపూడి, రేచర్ల ప్రాంతాల్లో భూఉపరితలం నుంచి 600 మీటర్ల కంటే ఎక్కువ లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.సాధారణ పద్ధతిలో అంత లోతు నుంచి బొగ్గును బయటకు తవ్వితీసి రవాణా చేయడం ఆర్థికంగా, సాంకేతికంగా అత్యంత శ్రమతో కూడుకున్న పని. అందువల్ల అత్యాధునిక యుసిజి సాంకేతికత ద్వారా బొగ్గును నేరుగా భూమి పొరల్లోనే మండించి, దానిని సింథటిక్ గ్యాస్ రూపంలోకి మార్చి పైకి తీస్తారు. సాంప్రదాయ మైనింగ్ అవసరం లేకుండా, పర్యావరణానికి ముప్పు తగ్గించేలా ఈ గ్రీన్ ఎనర్జీ సాంకేతికత ఉపయోగపడనుంది. జియోలాజికల్ అంచనాల ప్రకారం ఈ రెండు బ్లాకుల్లో కలిపి ఏకంగా 3,130.61 మిలియన్ టన్నుల అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇందులో చింతలపూడి బ్లాక్ 1,200 హెక్టార్లలో విస్తరించి 904.94 మిలియన్ టన్నుల జీ-12' గ్రేడ్ బొగ్గును కలిగి ఉండగా, రేచర్ల బ్లాక్ 2,225 హెక్టార్లలో 2,225.67 మిలియన్ టన్నుల జీ-13 గ్రేడ్ నిల్వలను కలిగి ఉంది. ఈ బొగ్గు నుంచి ప్రాసెస్ చేసే సింథటిక్ గ్యాస్‌ను యూరియా, అమ్మోనియా వంటి ఎరువుల తయారీకే కాకుండా మెథనాల్, సింథటిక్ ఇంధనాలు, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగిస్తారు. 2029 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ ఇంధన భద్రతలో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రూ.లక్ష కోట్ల భారీ పెట్టుబడితో వస్తున్న ఈ ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతాన్నివ్వడమే కాకుండా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధనాలు, ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.

Post a Comment

0 Comments

Close Menu