తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు : వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటినప్పటికీ, దాని ప్రభావం ఇంకా బలంగానే కొనసాగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, గంటకు 30-40కి.మీ వేగం తో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్ష సూచనతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ప్రమాదకరంగా ఉన్న 13 ప్రాంతాల్లో మరమ్మతులు, పునరుద్ధరణ పనులను 'జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)' హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం చేపట్టింది. ఇప్పటికే 8ప్రాంతాల్లో పనులు చివరిదశకు రాగా... మిగతా 5 ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్నా యి. ప్రధానంగా మహబూబ్‌నగర్, మంచిర్యాల, కామారెడ్డి, ఖమ్మం జిల్లాతో పాటు సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రాంతాల్లో ప్రమాదకర, సమస్యాత్మక బ్లాక్ స్పాట్లను గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ దిద్దుబా టు చర్యలు చేపట్టింది. రహదారుల కింద వరద నీటి డ్రెయిన్లను రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్‌తో నిర్మించడం, దెబ్బతిన్న బ్రిడ్జిలను పునరుద్ధరించడం, గుంతలకు మరమ్మతు వంటి పనులను చేపడుతోంది. భారీ వర్షాల సమయంలో సాయం కోసం ప్రయాణికులు టోల్ ఫ్రీ నెంబర్ 1033కు సమాచారం ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది.