కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో విశ్వాస్ జ్యువెలర్స్ అనే ఓ గోల్డ్ షాపులో నిత్యం బంగారు ఆభరణాలు కనబడకుండా పోతున్నాయి. ప్రతి ఉదయం దుకాణానికి వచ్చిన సిబ్బంది కొన్ని బంగారు ఉంగరాలు కనిపించకపోవడాన్ని గమనిస్తున్నారు. దీంతో వారు వెంటనే యజమానికి సమాచారం అందించారు. దొంగను కనిపెట్టేందుకు యజమాని దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే సీసీటీవీలో కనిపించిన దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ఎలుక ఇప్పటి వరకు 10 ఉంగరాలు, రెండు గొలుసులతో పాటు వాటికి సంబంధించిన ధర ట్యాగ్‌లు కూడా ఎత్తుకుపోయింది. సాధారణంగా దొంగలు బంగారాన్ని మాత్రమే తీసుకెళ్తారు కానీ ట్యాగ్‌లను తీసుకెళ్లరని భావించిన యజమానికి ఏదో అసాధారణ ఘటన జరిగిందనే అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో అయితే నగలు దొంగిలించినది మనిషి కాదు, ఓ ఎలుక అని తేలడంతో అంతా తెల్లమొహాలు వేశారు. రాత్రి సమయంలో ఓ ఎలుక దర్జాగా షాపులో ప్రవేశించి బంగారు ఉంగరాన్ని నోటితో పట్టుకుని పరుగెత్తడం వీడియోలో కనిపించింది. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో రికార్డైన వీడియోలో అసలు విషయం బయటపడింది. ఎలుక బంగారు ఉంగరాలను తీసుకెళ్లినట్లు గుర్తించిన సిబ్బంది షాపు మొత్తం వెతికారు. షాపులో ఎలుకలు చేసిన కలుగులు, వాటి దారులు కనిపించాయి. చివరకు ఆ కలుగుల్లోనే కనిపించకుండా పోయిన 10 బంగారు ఉంగరాలు, ధర ట్యాగ్‌లు దొరికాయి. అయితే వీటిని దొంగిలించిన దొంగ ఎలుక మాత్రం వారికి కనిపించలేదు. షాపు సిబ్బంది కలుగులన్నింటినీ మూసి వేశారు.
0 Comments