Ad Code

తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు : అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమేవేశంలో తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు పింఛన్లు దోహదపడతాయన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యానికి తావివ్వద్దన్నారు. మండలస్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 45 రోజులకు ఒకసారి మండల పరిషత్తు సమావేశాలు నిర్వహించాలని, సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు. సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయన్నారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు ఉండాలని, ప్రతి పంచాయతీకి పంచాయతీ కార్యాలయం నిర్మించాలని సీఎం ఆదేశించారు. పంచాయతీలోని జనాభా ఆధారంగా ఏ, బీ, సీలుగా వర్గీకరించి భవనాలు నిర్మించాలన్నారు. కార్యదర్శులు పారిశుధ్య పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో బాధ్యత వహించేలా చూడాలన్నారు. వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీలకు పారిశుధ్య, ఇతర పనులకు ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కోటిమంది వహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని సూచించారు. డిజైన్ల రూపకల్పనకు ఎనఐఎఫ్‌టీ విద్యార్థులను వినియోగించుకోవాలని తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో తాగు నీటి సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామీణ తాగు నీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. తాగు నీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామీణ తాగు నీటి పథకాల పరిధిలో పనిచేసే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ 5వ తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. స్థానిక వనరుల ఆధారంగా తాగు నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, పీఆర్ అండ్ ఆర్డీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఈవో సెర్ప్ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu