Ad Code

విదర్భ క్రికెట్ అసోసియేషన్ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన యువ క్రికెటర్

హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జాతీయ క్రికెట్ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా కష్టపడుతున్న 17 ఏళ్ల యువ క్రికెటర్ అదితి మోరేశ్వర్ చౌఖాండే తీవ్ర మానసిక ఒత్తిడికి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ ఇటీవల విడుదల చేసిన సెలక్షన్ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగ్‌పూర్ లక్ష్మీనగర్‌లోని తన నివాసంలో బుధవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న లక్ష్మీనగర్ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, బాలిక రాసిన ఒక చేతిరాత సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో హిందీలో "మేరా సెలెక్షన్ నహీ హువా" (నేను ఎంపిక కాలేదు) అని రాసి ఉంది. రాత్రింబవళ్లు కష్టపడి శిక్షణ పొందినప్పటికీ విదర్భ క్రికెట్ జట్టు సెలక్షన్స్‌లో చోటు దక్కకపోవడం, తన పేరు జాబితాలో కనిపించకపోవడంతో ఆ బాలిక గత కొన్ని రోజులుగా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు , పోలీసులు వెల్లడించారు. ఆ అపజయాన్ని తట్టుకోలేకనే ఈ దారుణమైన నిర్ణయానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన ఈ బాలికకు చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి. దేశవాళీ మ్యాచ్‌ల్లో, ఆపై అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనేది ఆమె ఏకైక ఆశయం. ఈ కలను సాకారం చేసుకోవడం కోసమే గత రెండేళ్లుగా ఆమె తన తల్లితో కలిసి అకోలా నుంచి నాగ్‌పూర్‌కు మకాం మార్చింది. నాగ్‌పూర్‌లోని ఒక ప్రముఖ క్రికెట్ అకాడమీలో చేరి రోజూ గంటల తరబడి కఠినమైన శిక్షణ పొందుతోంది. విశేషమేమిటంటే ఆమె సోదరుడు కూడా క్రికెటర్ కావడంతో, ఇంట్లోనూ ఆమెకు క్రికెట్‌పై పూర్తి ప్రోత్సాహం లభించింది. ఎంతో శ్రమించి ఆడినా ఆశించిన ఫలితం దక్కకపోవడంతో  మనసు విరిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు ప్రమాదవశాత్తు మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రికెట్ అకాడమీలోని శిక్షకులను, తోటి క్రీడాకారులను కూడా ప్రశ్నించి, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu