Ad Code

ఓఆర్‌ఆర్‌పై ఆగిఉన్న సిమెంట్‌ లారీని ఢీకొన్న స్విఫ్ట్‌ కారు : ఇద్దరి దుర్మరణం

హైదరాబాద్ లో  ఓఆర్‌ఆర్‌పై ఆగిఉన్న సిమెంట్‌ లారీని ఢీకొట్టడంతో స్విఫ్ట్‌ కారులోని యువకుడితో పాటు యువతి దుర్మరణం చెందిన ఘటన గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. యాదాద్రి- భువనగిరి జిల్లా బొమ్మలరామారం మరియాల గ్రామానికి చెందిన కత్రావత్‌ సురేందర్‌ (19), ప్రణతి రెడ్డి (19) ఎల్‌బీనగర్‌ అనుష్కపూర్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ విద్యనభ్యసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సురేందర్‌ స్విఫ్ట్‌ కారు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బొమ్మలరామారం నుంచి కారులో బయలుదేరాడు. మంగళవారం ఉదయం కళాశాల హాస్టల్‌ వద్ద స్నేహితురాలు ప్రణతి రెడ్డిని పికప్‌ చేసుకున్నాడు. సాయంత్రం 5.45 గంటల సమయంలో వట్టినాగులపల్లి నియోపొలిస్‌ సమీపంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆగి ఉన్న సిమెంట్‌ లారీని కారు అతివేగంతో ఢీకొంది. లారీలోకి కారు చొచ్చుకుపోయి ముందు భాగం నుజ్జునుజ్జయింది. సురేందర్, ప్రణతి అక్కడికక్కడే మృతి చెందారు. లారీలో ఇరుక్కు పోయిన కారును క్రేన్‌ సహాయంతో తీసి మృతదేహాలను వెలికి తీశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా రోడ్డుపై లారీ నిలిపాడని, ప్రమాదం జరగగానే పారిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu