Friday, July 31, 2026

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీ : వేదికలను ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీకి సంబంధించిన వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా ఈవెంట్ కోసం మొత్తం 12 స్టేడియాలను ఎంపిక చేశారు. సరిగ్గా 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆఫ్రికా ఖండంలో ఈ క్రికెట్ పండుగ జరగనుండటం అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచ కప్ 2027 కోసం ఐసీసీ మొత్తం 12 వేదికలను ఖరారు చేయగా.. అందులో అత్యధికంగా 8 స్టేడియాలు దక్షిణాఫ్రికాలోనే ఉండటం గమనార్హం. జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రతిష్టాత్మక వాండరర్స్ స్టేడియంతో పాటు సెంచూరియన్, కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్, డర్బన్‌లోని కింగ్స్‌మీడ్, గ్వెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, బ్లూమ్‌ఫోంటైన్‌లోని మాంగాంగ్ ఓవల్, పార్ల్‌లోని బోలాండ్ పార్క్, కుగోంపో సిటీలోని బఫెలో పార్క్ మైదానాల్లో ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లు జరగనున్నాయి. విశేషం ఏంటంటే 2003లో జరిగిన వరల్డ్ కప్‌లోనూ సరిగ్గా ఇవే 8 మైదానాలు ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చాయి. ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ఐసీసీ మరోసారి ఈ స్టేడియాలకే ఓటు వేసింది. టోర్నీ ప్రారంభ వేడుకలతో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలోనే జరగనుండటం అభిమానులకు నాటి పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది. ఈ టోర్నీకి సహ ఆతిథ్య దేశంగా ఉన్న జింబాబ్వేకు మూడు అద్భుతమైన వేదికలు దక్కాయి. రాజధాని నగరమైన హరారేలోని స్పోర్ట్స్ క్లబ్, బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌తో పాటు పర్యాటక కేంద్రమైన విక్టోరియా ఫాల్స్ వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫాలే మోసీ-ఓవా-తున్యా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నమీబియా రాజధాని విండ్‌హోక్‌లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్ తొలిసారిగా ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వబోతోంది. ఒక చిన్న దేశమైన నమీబియా చరిత్రలో తొలిసారిగా ఒక అంతర్జాతీయ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వడం నిజంగా వారికి దక్కిన అరుదైన గౌరవం. గత రెండు వరల్డ్ కప్ ఎడిషన్లలో కేవలం 10 జట్లు మాత్రమే పాల్గొనగా, 2027 ఎడిషన్‌లో ఆ సంఖ్యను 14 జట్లకు పెంచారు. దాదాపు నెలన్నర పాటు అంటే అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు ఈ టోర్నీ సుదీర్ఘంగా సాగనుంది. ఈ వ్యవధిలో మొత్తం 57 మ్యాచ్‌లు క్రికెట్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. ఈసారి ఐసీసీ ఒక సరికొత్త ఫార్మాట్‌ను అభిమానుల ముందుకు తీసుకువస్తోంది. సెమీ ఫైనల్, గ్రాండ్ ఫినాలే మ్యాచ్‌లకు ముందు ఈ 57 మ్యాచ్‌ల ఈవెంట్‌ను మూడు భిన్నమైన రౌండ్లుగా విభజించి నిర్వహించనున్నారు. గత వరల్డ్ కప్ ఫైనల్లో అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌ను ఓడించి కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. ఆఫ్రికా ఖండపు అద్భుతమైన సంస్కృతిని, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ టోర్నీని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఐసీసీ ఛైర్మన్ జై షా ధీమా వ్యక్తం చేశారు. వేదికల ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో అప్పుడే వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. కొత్త ఫార్మాట్, కొత్త ఆతిథ్య దేశాలతో రాబోయే ఈ టోర్నీ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మెగా ఈవెంట్ కోసం క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.