Ad Code

పదేళ్ల తర్వాత నేపాల్‌లో చెల్లనున్న భారత కరెన్సీ

నేపాల్ లో పదేళ్లుగా కొనసాగుతున్న భారత కరెన్సీ వినియోగంపై ఆంక్షలను సడలిస్తూ, రూ.200, రూ. 500 విలువైన భారత కరెన్సీ నోట్లను దేశంలోకతీసుకురావడానికి, అలాగే తిరిగి తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చింది. భారతీయులు, నేపాల్ పౌరులు ఇరు దేశాల మధ్య ప్రయాణించేటప్పుడు గరిష్టంగా రూ. 25,000 పరిమితికి లోబడి ఈ నోట్లను తమ వెంట ఉంచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో 2016లో భారత్ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు తర్వాత విధించిన కఠిన నిబంధనలకు తెరపడినట్లయింది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఈ నిబంధనలపై ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 2016 నవంబర్ 9 తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన కొత్త రూ. 200, రూ. 500 నోట్లకు మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని తెలిపింది. నోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న పాత రూ. 500, రూ. 1,000 నోట్లపై నిషేధం యథావిధిగా కొనసాగుతుందని ఎన్ఆర్‌బీ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 11నే నేపాల్ గెజిట్‌లో ప్రచురితమైనప్పటికీ, అమలులో పూర్తి స్పష్టత కోసం కేంద్ర బ్యాంక్ మరోసారి అధికారిక ప్రకటన జారీ చేసింది. ఎన్ఆర్‌బీ ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ ఈ వివరాలపై మాట్లాడుతూ నేపాల్ పౌరులు భారత్ నుంచి మాత్రమే ఈ కరెన్సీని దేశంలోకి తీసుకురావాలని, నేపాల్ నుంచి భారత్‌కు తప్ప మరే ఇతర మూడో దేశానికీ తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు. ఈ తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సరిహద్దు వ్యాపారం మరియు పర్యాటకం మరింత సులభతరం కానున్నాయి. ముఖ్యంగా నేపాలీ వ్యాపారులు, భారత పర్యాటకులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. భారత్, నేపాల్ మధ్య స్వేచ్ఛాయుత సరిహద్దు ఉండటంతో పాటు వాణిజ్యపరంగా బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత్, నేపాల్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేవలం రూ. 100, అంతకంటే తక్కువ విలువైన నోట్లను మాత్రమే అనుమతించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మొత్తం నగదు పరిమితి రూ. 25,000గా ఉన్నప్పటికీ, అధిక విలువ కలిగిన నోట్లను అనుమతించడం వల్ల సరిహద్దు లావాదేవీలు వేగవంతమవుతాయి. ఇతర విదేశీ కరెన్సీల విషయంలో ఎలాంటి డిక్లరేషన్ లేకుండా 5,000 డాలర్ల వరకు దేశంలోకి తీసుకువచ్చే నిబంధన యధాతథంగా కొనసాగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu