తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద భక్తులకు జారీ చేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్లను బుధవారం రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శుక్రవారం జరిగే దర్శనానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులకు యథావిధిగా టోకెన్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను గ్రామస్థాయిలో విస్తరించేందుకు టీటీడీ ప్రత్యేక కృషి చేస్తోందని ఈవో ఎం. రవిచంద్ర తెలిపారు. మంగళవారం స్థానిక శ్రీవారి సేవాసదన్‌లో గ్రూప్ సూపర్‌వైజర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 50 వేల ఆలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలందించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. శ్రీవారి సేవకులకు వారి పనితీరు ఆధారంగా 'సిబిల్' స్కోర్ తరహాలో రేటింగ్ ఇచ్చి, ఆపై విధులు కేటాయించే వినూత్న విధానంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో ఎం.రవిచంద్ర వెల్లడించారు. ఈ సమావేశంలో గ్రూప్ సూపర్‌వైజర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.టి. శ్రీనివాస్, చెన్నైకు చెందిన శరత్‌లను ఈవో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తితిదే సీపీఆర్వో డా.టి.రవి, పీఆర్వో నీలిమ తదితరులు పాల్గొన్నారు.
0 Comments