కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఒక ప్రముఖ హోటల్‌లో, కొందరు స్నేహితులు కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నప్పుడు ఊహించని విధంగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అందులో ఒక యువకుడు గుడ్డు తింటున్నప్పుడు, అది ఊహించని విధంగా అతని గొంతులో చిక్కుకుంది. దీనివల్ల అతనికి ఊపిరి ఆడక, మాట్లాడటానికి కూడా వీలులేక తన గొంతు పట్టుకుని ప్రాణాలతో పోరాడటం ప్రారంభించాడు. హోటల్‌లో ఉన్నవారందరూ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే, ఆ యువకుడి ముఖంలో మార్పును, ఊపిరాడకపోవడాన్ని గమనించిన అతని స్నేహితుడు వెంటనే రంగంలోకి దిగి బాధితుడి వెనుక వైపుకు వెళ్ళి నిలబడి, 'హైమ్లిచ్ మేనూవర్' అని పిలిచే ప్రసిద్ధ ప్రథమ చికిత్స పద్ధతిని ఉపయోగించాడు. అంటే, బాధితుడి పొట్ట భాగాన్ని వెనుక నుండి గట్టిగా పట్టుకుని, పైకి బలంగా నొక్కి పటాడు. అతను ఇచ్చిన ఆ తక్షణ ఒత్తిడి కారణంగా, గొంతులో అడ్డుపడిన గుడ్డు ముక్క కొద్ది సెకన్లలోనే బయటకు వచ్చి పడింది. దీనితో మూసుకుపోయిన శ్వాసనాళం వెంటనే సరిగ్గా మారి, ఆ యువకుడు మళ్లీ సాధారణంగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించాడు.
0 Comments