ఇజ్రాయిల్ దేశానికి చెందిన ప్రతిష్టాత్మక 'గివాటి బ్రిగేడ్'కు చెందిన 'త్సబార్ బెటాలియన్' నుంచి దాదాపు వంద మందికి పైగా సైనికులు తమ కమాండర్లతో విభేదించి, ఆర్మీ బేస్‌ను వదిలి వెళ్ళిపోవడం కలకలం రేపింది. క్రమశిక్షణకు మారుపేరుగా భావించే ఇజ్రాయిల్ సైన్యంలో ఇలాంటి తిరుగుబాటు తరహా సంఘటన జరగడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నెగెవ్ ఎడారిలోని 'స్డే తేమాన్' సైనిక స్థావరంలో గురువారం ఈ ఘటనా క్రమం చోటుచేసుకుంది. గాజా, దక్షిణ లెబనాన్ యుద్ధరంగాల్లో సైనికులు ప్రదర్శించిన సాంప్రదాయ చిహ్నాలు, ప్లేకార్డులను బెటాలియన్ కమాండర్ తొలగించడమే ఈ అసంతృప్తికి ప్రధాన కారణం. సైనిక విభాగాల్లో ఒక బ్యాచ్ నుంచి మరొక బ్యాచ్‌కు అనుభవపూర్వకంగా అందుతూ వస్తున్న సంప్రదాయ సంకేతాలను కమాండర్ స్వయంగా సుత్తితో పగులగొట్టి తొలగించడం సైనికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సైనికులు తమ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమకు కేటాయించిన ఆయుధాలను స్థావరంలోనే వదిలేసి, వ్యక్తిగత వస్తువులతో ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక, సైనికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బేస్ బయటకు నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా ప్రచారమయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇజ్రాయిల్‌లో సైనిక తిరుగుబాటు మొదలైందని వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఘటనపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా స్పందిస్తూ, ఇది తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యమని వ్యాఖ్యానించింది. కొత్తగా చేరే జూనియర్ సైనికులను ర్యాగింగ్ చేసే అవాంఛనీయ సంప్రదాయాలకు సంబంధించిన బోర్డులను మాత్రమే తొలగించామని కమాండర్లు స్పష్టం చేశారు. ఆర్మీ అధికారుల ప్రకటన ప్రకారం, ఈ ఘటనపై అంతర్గత విచారణ ప్రారంభమైంది. సాయంత్రంలోగా బేస్‌కు తిరిగి రాకపోతే కఠినమైన మిలిటరీ కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదేశాలు జారీ చేయడంతో మెజారిటీ సైనికులు తిరిగి విధుల్లోకి చేరినట్టు సమాచారం. ఈ పరిణామాన్ని అరబ్, మధ్యప్రాచ్య మీడియా సంస్థలు భిన్న కోణంలో విశ్లేషించాయి. ఇరాన్ మద్దతుగల ఇరాకీ 'నయా' ఏజెన్సీ ఈ ఘటనను ఆక్రమణ సైన్యంలో అంతర్గత కూలిపోతగా అభివర్ణించింది. ఇక లెబనాన్ వార్తా ఛానెళ్లు ఈ ఘటనను మరో విధంగా విశ్లేషిస్తున్నాయి. సైనికులు ఆయుధాలు వదిలేసి వెళ్ళడాన్ని ప్రత్యక్ష మిలిటరీ తిరుగుబాటుగా పేర్కొన్నాయి. సుదీర్ఘ కాలంగా సాగుతున్న పోరాటాల వల్ల ఇజ్రాయిల్ ఆర్మీ ఐక్యత, పట్టు సడలుతోందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని మరికొన్ని అంతర్జాతీయ మీడియా ఛానళ్లు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి ఇజ్రాయిల్ సైన్యంలో మొదలైన ఈ ముసలం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఈ పరిణామాలను బట్టి మొత్తంగా చూసుకుంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి, నెలల తరబడి గాజా, లెబనాన్ సరిహద్దుల్లో సాగుతున్న సుదీర్ఘ యుద్ధ వాతావరణం సైనికులలో మానసిక అలసటను పెంచాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు అంతర్జాతీయ దౌత్య ఒత్తిళ్లు, మరోవైపు అంతర్గత విభేదాలు ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి.
0 Comments