Ad Code

పది భారతీయ భాషల్లో "ఆస్క్ గూగుల్ పే" పేరుతో ఏఐ ఫీచర్‌ !

గూగుల్ పే యాప్‌ "ఆస్క్ గూగుల్ పే" పేరుతో జెమినై ఆధారిత ఏఐ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. టైప్ చేయడం లేదా వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా గతంలో చేసిన ఖర్చుల వివరాలను ఏఐ వెంటనే విశ్లేషించి సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు.. గత నెలలో రెస్టారెంట్లలో ఎంత ఖర్చు చేశాను? ఈ వారం ఎక్కువగా డబ్బు ఎక్కడ ఖర్చయింది? నా నెలవారీ ఖర్చులను ఎలా నియంత్రించుకోవచ్చు? ఇలాంటి ప్రశ్నలకు వ్యక్తిగత లావాదేవీల ఆధారంగా సమగ్ర సమాధానాలు అందిస్తుంది. కేవలం ఖర్చుల వివరాలకే పరిమితం కాకుండా, ఈ ఏఐ అసిస్టెంట్ ఆర్థిక నిర్వహణకు ఉపయోగపడే సూచనలను కూడా ఇస్తుంది. నెలవారీ బడ్జెట్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలి, అవసరం లేని ఖర్చులను ఎలా తగ్గించాలి వంటి విషయాల్లో మార్గదర్శకత్వం అందిస్తుంది. అదనంగా.. SIP పెట్టుబడులపై సమాచారం, క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన వివరాలు, ప్రయాణాలు, షాపింగ్ సమయంలో అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డు ఆఫర్లు వంటి అంశాలను కూడా యాప్‌లోనే చూడొచ్చు. దీంతో వేరే యాప్‌లు ఉపయోగించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ కొత్త ఏఐ ఫీచర్ ప్రస్తుతం 10 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తోంది. ప్రాంతీయ భాషల్లోనే ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందే అవకాశం ఉండటంతో మరింత మంది వినియోగదారులు సులభంగా ఉపయోగించుకోగలుగుతారు. వాయిస్, టెక్స్ట్ రెండు విధానాల్లోనూ ఈ సేవలను వినియోగించవచ్చు. గూగుల్, ఎస్‌బీఐ కార్డ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని Google Pay Flex SBI Cardను కూడా పరిచయం చేసింది. ఈ క్రెడిట్ కార్డు రూపే, వీసా నెట్‌వర్క్‌లలో లభిస్తుంది. గూగుల్ పే యాప్ ద్వారానే ఎలాంటి పేపర్ డాక్యుమెంట్లు సమర్పించకుండా కొన్ని నిమిషాల్లో దరఖాస్తు చేసే అవకాశం కల్పించారు. ఈ కార్డుతో ప్రతి కొనుగోలుపై రివార్డ్స్ పొందవచ్చు. అలాగే అవసరమైతే క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చుకునే సౌకర్యం కూడా ఉంటుంది. గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్‌బీఐ కార్డు తీసుకునే వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కూడా ప్రకటించారు. గూగుల్ ఏఐ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌పై ఒక సంవత్సరం పాటు 50 శాతం రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త సేవలతో గూగుల్ పే కేవలం చెల్లింపుల యాప్‌గా కాకుండా వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు ఉపయోగపడే సమగ్ర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu