ఉక్రెయిన్ తమ వాణిజ్య నౌకపై జరిపిన దాడిలో ఒక నావికుడు మరణించగా.. మరొకరు గాయపడినట్లు ఇరాన్ తెలిపింది. తమ దేశ ప్రయోజనాలు, ఆస్తులను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడబోమని స్పష్టం చేసింది. ఈ దాడికి కారణమైన ఉక్రెయిన్ తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండాలంటే.. కీవ్‌ను కట్టడి చేయాలని ఐరోపా దేశాలను ఇరాన్ డిమాండ్ చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో తమకు సంభందం లేదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. అయితే రష్యా నుంచి ఇరాన్‌కు ఉపగ్రహ సమాచారం అందుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలపై రష్యా సేకరిస్తోన్న ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ తన దాడులకు వినియోగిస్తోందన్నారు. కాస్పియన్ సముద్ర మార్గం ప్రస్తుతం ఇరాన్‌కు అత్యంత కీలకమైంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఉత్తర దిశలోని ఈ మార్గం ద్వారా చైనా సహా పలు దేశాల నుంచి వస్తువులు ఇరాన్‌కు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
0 Comments