బంగ్లాదేశ్‌లో శ్యామ్‌దాస్‌ ప్రభు అరెస్టు !


బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇస్కాన్‌కు చెందిన మరో సభ్యుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఇస్కాన్‌ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్‌ దాస్‌ 'ఎక్స్‌' (ట్విటర్‌)లో వెల్లడించారు. ''ఇస్కాన్‌ సభ్యుడు శ్యామ్‌దాస్‌ ప్రభును ఎలాంటి వారెంట్‌ లేకుండా చటోగ్రామ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతను ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా..?ఎలాంటి నేరం చేయకుండానే అరెస్టు చేయడం దిగ్ర్భాంతిని కలిగించింది'' అని పేర్కొన్నారు. అంతేకాకుండా బంగ్లాలోని ఇస్కాన్‌ సెంటర్‌ను కొందరు ధ్వంసం చేసినట్లు తెలిపారు. అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్‌.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీకి చెందిన నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్‌) కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్‌ వేయగా బంగ్లా హైకోర్టు దానిని కొట్టివేసింది. ఈ వ్యవహారంలో భాగంగా ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. దేశంలో హిందువుల భద్రత కోసం డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేపట్టనున్నట్లు ఇస్కాన్ వెల్లడించింది. ఈ క్రమంలోనే మరో సభ్యుడు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది.

Post a Comment

0 Comments