Saturday, October 17, 2026

ఎనర్జాన్ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసిన స్విట్జర్లాండ్‌కు చెందిన కోటెక్నా

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ టెస్టింగ్, ఇన్‌స్పెక్షన్, సర్టిఫికేషన్ దిగ్గజం కోటెక్నా, హైదరాబాద్‌కు చెందిన ఎనర్జాన్ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. సీజీఎంపీ  ప్రమాణాలతో పాటు, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు పూర్తి చేసుకుని, ISO 9001:2015, ISO 17025:2017 వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గుర్తింపులు పొందిన ఎనర్జాన్ ల్యాబ్స్ కలయికతో కోటెక్నా తన గ్లోబల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంది. గ్లోబల్ ఫార్మా, బయోటెక్నాలజీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లోని నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు కోటెక్నాకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్, అమెరికా, ఆసియా పసిఫిక్ మరియు మధ్యప్రాచ్య దేశాల్లోని ఫార్మా, బయో ఫార్మా, మెడికల్ డివైసెస్ మరియు ప్యాకేజింగ్ రంగాలకు అవసరమైన విశ్లేషణాత్మక సేవలు మరింత సులభంగా, వేగవంతంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారత్ కీలక ఔషధ తయారీ కేంద్రంగా ఎదిగిన నేపధ్యంలో, ఈ కొనుగోలు అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఫార్మా ఉత్పత్తుల విస్తరణకు ఎంతగానో దోహదపడుతుంది. ఎనర్జాన్ ల్యాబ్స్ అందించే అనలిటికల్ పద్ధతుల అభివృద్ధి, స్థిరత్వ పరీక్షలు, మలినాల విశ్లేషణ, పెప్టైడ్లు మరియు ఒలిగోన్యూక్లియోటైడ్ల అధ్యయనం, నిబంధనల సలహా సేవలు  వంటి నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా కఠినమైన నియంత్రణ ప్రమాణాలు కలిగిన మార్కెట్లలో భారతీయ తయారీదారులకు కోటెక్నాను ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలుపుతాయి. ఇప్పటికే శివ అనలిటికల్స్, నియోట్రాన్ ఫార్మా వంటి సంస్థలతో విస్తరిస్తున్న కోటెక్నా, ఎనర్జాన్ కలయికతో భారత లైఫ్ సైన్సెస్ విభాగంలో అగ్రగామిగా ఎదగడమే కాకుండా, ఉత్పత్తి తయారీ దశ నుండి మార్కెట్‌కు చేరే వరకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించనుంది.