Ad Code

ఐఎల్‌ఒ నివేదిక మోడీ పకోడా నామిక్స్‌ ప్రత్యక్ష పరిణామం : జైరాం రమేష్‌


అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) నివేదికపై శుక్రవారం కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ ప్రతినిధి జైరాం రమేష్‌ స్పందించారు. ఐఎల్‌ఒ నివేదికను ఉటంకిస్తూ  ఇది ప్రధాని మోడీ పకోడా నామిక్స్‌ ప్రత్యక్ష పరిణామమని ధ్వజమెత్తారు. ఐఎల్‌ఒ ఇటీవల విడుదల చేసిన ' ప్రపంచ వేతన నివేదిక 2024-2025' భారత దేశంలో వేతన అసమానతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ఆదాయం పొందేవారిలో మొదటి 10 శాతం మంది దిగువ 10 శాతం కంటే 6.8 రెట్లు అధికంగా సంపాదిస్తున్నారని అన్నారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌ మరియు మయన్మార్‌లతో సహా మన పొరుగున ఉన్న దాదాపు ప్రతి దేశం కన్నా వేతనాలు చాలా అసమానంగా ఉన్నాయని ఎక్స్‌లో పేర్కొన్నారు. తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో వేతన కార్మికులలో భారతదేశం అత్యల్పవాటాను కలిగి ఉందని నివేదికను ఉదహరించారు. చాలా మంది కార్మికులు స్వయం ఉపాధి కలిగి ఉన్నారని, అయితే ఇది అనధికారికంగా, తక్కువ వేతనంతో మరియు ఎక్కువ అస్థిరతకు గురవుతుందని అన్నారు. ఇది నాన్‌ బయోలాజికల్‌ పిఎం సృష్టించిన పకోడా -నామిక్స్‌ ప్రత్యక్ష పరిణామ ఫలితమని ఉద్ఘాటించారు. ప్రజలకు పకోడాలు, ఎంచుకున్న కొద్ది మందికి హల్వా అందిస్తున్నారని మండిపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu