కృష్ణ వంశీ డైరెక్షన్ లో 2003లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'ఖడ్గం'లో నటుడు సుబ్బరాజు చిన్న పాత్రలో కనిపించడం ద్వారా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలోనూ నటించడంతో మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత పూరి జగన్నాధ్ సినిమాతో సుబ్బరాజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తక్కువ సమయంలోనే మంచి పాత్రల్లో నటించే అవకాశం రావడంతో ఇండస్ట్రీలో మంచి స్టార్ గా ఎదిగాడు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుబ్బరాజు పోషించిన పాత్రలు ప్రేక్షకులను మెప్పించడంతో ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడం భాషల్లోనూ సుబ్బరాజు సినిమాలు చేసి మెప్పించాడు. అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాలు చేసిన సుబ్బరాజు తాజాగా 47 ఏళ్ల వయసులో ఒక ఇంటివాడు అయ్యాడు.ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆసక్తి లేదు అని చెప్పిన సుబ్బరాజు ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కారు. వివాహ బంధంలో అడుగు పెడుతున్నట్లుగా సుబ్బరాజు స్వయంగా సోషల్ మీడియా ద్వారా పెళ్లి ఫోటోను షేర్ చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చారు.
0 Comments