దేశంలో గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైళ్లు త్వరలో రాబోతున్నాయి. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. బీఈఎంఎల్‌తో కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్ల డిజైన్, తయారీ కొనసాగుతోందని భాజపా ఎంపీ సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్ లో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వందేభారత్ రైళ్లు విజయవంతం అయిన నేపథ్యంలో మేకిన్ ఇండియా స్ఫూర్తితో హైస్పీడ్ రైళ్ల తయారీ చేపట్టినట్లు వైష్ణవ్ తెలిపారు. ఇందుకోసం ఒక్కో కార్‌కు (బోగీ) ట్యాక్సులు మినహాయించి రూ.28 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇతర బోగీలతో పోలిస్తే ఈ ఖర్చు ఎక్కువని పేర్కొన్నారు. అయితే, హైస్పీడ్ రైళ్ల సెట్ల తయారీ సంక్లిష్టమని, సాంకేతిక అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు. సాధారణ రైళ్లతో పోలిస్తే వీటి ఏరోడైనమిక్ భిన్నంగా ఉంటాయని వైష్ణవ్ చెప్పారు. గాలి చొచ్చుకోవడానికి వీల్లేకుండా బాడీ ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం అన్నీ చైర్ కార్సే ఉంటాయని చెప్పారు. అత్యాధునిక ఫీచర్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆటోమేటిక్ డోర్స్, బోగీకి బోగీకి మధ్య అనుసంధానం, బయటి వాతావరణానికి అనుగుణంగా బోగీ లోపలి పరిస్థితులు, సీసీటీవీ, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉంటాయని పేర్కొన్నారు. డిజైన్ పూర్తయ్యాక ప్రాజెక్ట్ పూర్తికి అయ్యే వ్యయంపై ఓ అవగాహన వస్తుందని వైష్ణవ్ తెలిపారు.
0 Comments