Ad Code

ఎన్‌క్రిప్టెడ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థను సిద్ధం చేస్తోన్న వాట్సాప్


వాట్సాప్ సందేశాలు, ఫోటోలు, వీడియోలను భద్రపరుచుకోవడానికి గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ వంటి సేవలను వాడుతుంటాము. అయితే, గూగుల్ ఉచితంగా ఇచ్చే 15 జీబీ పరిమితి త్వరగానే నిండిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వుంటారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మెటా సంస్థ ఇప్పుడు సొంతంగా ఎన్‌క్రిప్టెడ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, వాట్సాప్ తన వినియోగదారులకు ప్రాథమికంగా 2 జీబీ వరకు ఉచిత స్టోరేజ్‌ను అందించే అవకాశం ఉంది. ఒకవేళ డేటా అంతకంటే ఎక్కువగా ఉంటే, తక్కువ ధరకే అదనపు స్టోరేజ్‌ను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించనున్నారు. నెలకు సుమారు 80 నుంచి 94 రూపాయల లోపు ధరలోనే దాదాపు 50 జీబీ వరకు డేటాను దాచుకునే ప్లాన్లను కంపెనీ పరిశీలిస్తోంది. దీనివల్ల గూగుల్ డ్రైవ్ నిండిపోయినా చాట్ బ్యాకప్ ఆగిపోదు. కేవలం స్టోరేజ్ మాత్రమే కాకుండా, భద్రత విషయంలోనూ వాట్సాప్ రాజీ పడటం లేదు. కొత్త క్లౌడ్ వ్యవస్థలో వినియోగదారులు తమ బ్యాకప్‌ను 'పాస్ కీ' ఫీచర్ ద్వారా భద్రపరుచుకోవచ్చు. అంటే ఇకపై పెద్ద పెద్ద పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. మీ ఫోన్ ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ లేదా స్క్రీన్ లాక్ సహాయంతోనే సులభంగా డేటాను రీస్టోర్ చేసుకోవచ్చు. ఇది హ్యాకర్ల నుంచి మీ వ్యక్తిగత సమాచారానికి పటిష్టమైన రక్షణ కల్పిస్తుంది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, పాత పద్ధతిని పూర్తిగా తొలగించడం లేదు. వినియోగదారులు తమకు నచ్చితే గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌ను కొనసాగించవచ్చు లేదా వాట్సాప్ అందిస్తున్న కొత్త క్లౌడ్ స్టోరేజ్‌కు మారిపోవచ్చు. ఈ అప్‌డేట్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu