Ad Code

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ : నూతనంగా ఎంపికైన 252 మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం


ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతనంగా ఎంపికైన 252 మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ నూతన కమిటీలో మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. సీనియారిటీ, నిబద్ధత, సమర్థతను ప్రాతిపదికగా తీసుకుని, సామాన్య కార్యకర్తలకు కూడా ఈ కార్యవర్గంలో ప్రాధాన్యత కల్పించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. తెలుగుదేశం కార్యకర్త ఎవరికీ తలొగ్గడని, ధైర్యంగా నిలబడతాడని ఆయన కొనియాడారు. దేశంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని, ప్రతి పోలింగ్ బూత్‌లోనూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో నారా లోకేష్ పార్టీలో ప్రక్షాళన తీసుకొచ్చి కార్యకర్తలకు బీమా కల్పించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో 2024లో సాధించిన ఓట్ల కంటే మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను కేంద్ర సహకారంతో తాము గట్టెక్కించామని సీఎం తెలిపారు. అప్పులను రీషెడ్యూల్ చేసి, కేంద్ర పథకాలను పునరుద్ధరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చామని చెప్పారు. భవిష్యత్తులో విశాఖపట్నం నగరాన్ని 'ఏఐ హబ్'గా తీర్చిదిద్దుతామని, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వంటి సంస్కరణలతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతి నెలా ఒకటో తేదీనే డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల క్రెడిట్‌ను దొంగిలించడానికి వైసీపీ  ప్రయత్నిస్తోందని, ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం అభివృద్ధికి మోకాలొడ్డుతూ, నిధులు రాకుండా అడ్డుకోవడంతో పాటు కోర్టుల్లో కేసులు వేస్తోందని ఆరోపించారు. కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి సంక్షేమం పట్టదని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రతిపక్షాల చెడును కూడా ప్రజలకు వివరించాలని కార్యవర్గ సభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చిన్న చిన్న విషయాలకు నేతలు గొడవలు పడొద్దని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఫ్లెక్సీలు, ఫొటోల వద్ద వివాదాలు వద్దని సూచించారు. రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే దాని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందన్నారు. కేంద్రమంత్రులు తప్పు చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తలొస్తాయన్నారు. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేదే లేదని, అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను సున్నితంగా హెచ్చరించారు. ఎవరు ఏం మాట్లాడినా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలని సూచించారు. మళ్లీ అధికారంలోకి రావాలంటే అందరినీ గౌరవించాలని, పార్టీ గౌరవాన్ని, ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచేలా నడుచుకోవాలని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu