టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇండియా టూర్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అందుకు గల అసలు కారణాన్ని కూడా ట్విట్టర్ (X) వేదికగా మస్క్ రివీల్ చేశాడు. 'దురదృష్టవశాత్తూ టెస్లాలో భారీ బాధ్యతల కారణంగా భారత్ పర్యటన మరింత ఆలస్యమవుతోంది. కానీ, ఈ ఏడాది చివర్లో భారత్ పర్యటన కోసం చాలా ఎదురుచూస్తున్నాను' అని ఎలన్ మస్క్ పోస్ట్‌లో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్‌లో మస్క్ పర్యటించాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. గతేడాది జూన్‌లో న్యూయార్క్‌లో మస్క్, మోడీని కలిశారు. ఇదే క్రమంలో భారత ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై పన్నులను తగ్గించాలని టెస్లా ఎప్పటినుంచో కోరుతోంది. టెస్లా భారత్‌లో ఈవీ యూనిట్ కోసం లోకల్ పార్టనర్ కోసం చూస్తోంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్‌తో కలిసి ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా చర్చలు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ స్థలాల కోసం మస్క్ ఏప్రిల్‌లో భారత్‌కు ఒక బృందాన్ని పంపినట్లు నివేదిక వెల్లడించింది. భారత మార్కెట్లోకి దాదాపు 3 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. టెస్లాను ఆకర్షించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. మస్క్ భారత్ పర్యటన వాయిదా కారణంగా టెస్లా ప్లాంట్ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0 Comments