ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు అధికారికంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీలో చేరారు. ఈ పరిణామంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. "గౌరవనీయులైన రాజ్యసభ చైర్మన్ ఏడుగురు రాజ్యసభ ఎంపీల విలీనాన్ని ఆమోదించారు. ఈ ఏడుగురు సభ్యులు బీజేపీ పార్లమెంటరీ పార్టీలో అంతర్భాగమయ్యారు. సుదీర్ఘకాలంగా వీరి పనితీరును గమనిస్తున్నాను. వీరు ఎప్పుడూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదు. పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు. క్రమశిక్షణ కలిగిన ఇటువంటి నేతలకు బీజేపీలోకి సాదర స్వాగతం పలుకుతున్నాను" అని రిజిజు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానిస్తూ, ఇదే క్రమంలో విపక్షాల 'ఇండి' కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. "తుక్డే-తుక్డే ఇండి అలయన్స్‌కు గుడ్ బై చెప్పే సమయం వచ్చింది" అంటూ ఆయన తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Post a Comment

Previous Post Next Post