ముంబై నుంచి సోలాపూర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పుణే రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ప్లాట్‌ఫారమ్ నెంబర్ 3కి చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు చక్రాలు పట్టాల నుంచి కిందకు దిగడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో రైలు తక్కువ వేగంతో ఉండటం వల్ల ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రాథమిక విచారణ ప్రకారం, రైల్వే స్టేషన్ సమీపంలోని డైమండ్ క్రాసింగ్ వద్ద తలెత్తిన సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. రైలు పట్టాలు మారే క్రమంలో ఈ సమస్య తలెత్తడంతో చక్రాలు పక్కకు జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పుణే రైల్వే డివిజన్ అధికారులు తక్షణమే స్పందించి, ప్రయాణికులను సురక్షితంగా రైలు నుంచి దించి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ రైలు పట్టాలు తప్పడంతో పుణే మీదుగా వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. రైల్వే ఇంజనీరింగ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పనులను ప్రారంభించింది. పట్టాలు తప్పిన కోచ్‌లను తిరిగి పట్టాలెక్కించే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు ఈ ఘటనపై లోతైన విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
0 Comments