ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోన్న పార్కిన్సన్స్ వ్యాధి వల్ల చేతులు కంపించడం, కదలికలు మందగించడం, శరీర నియంత్రణ తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటివరకు ఇది ప్రధానంగా మెదడు సమస్యగా భావించబడింది. అయితే తాజా పరిశోధనలు చూస్తే, ఈ వ్యాధి ప్రారంభానికి పేగులో ఉన్న సూక్ష్మజీవాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని సూచిస్తున్నాయి. మన పేగులో కోట్లాది సూక్ష్మజీవాలు ఉంటాయి. వీటిని మైక్రోబయోమ్ అంటారు. ఇవి జీర్ణక్రియతో పాటు శరీర ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. కొత్త అధ్యయనాల ప్రకారం, ఈ సూక్ష్మజీవాల సమతుల్యత మారిపోతే, అది నరాల వ్యవస్థపై కూడా ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు ఇది ఒక సంకేతంగా కనిపించవచ్చు. పరిశోధనలో ముఖ్యంగా GBA1 అనే జన్యు మార్పుపై దృష్టి పెట్టారు. ఈ జన్యు వేరియంట్ ఉన్నవారికి పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జన్యు మార్పు ఉన్న వ్యక్తుల పేగులో సూక్ష్మజీవాల నిర్మాణంలో గణనీయమైన మార్పులు కనిపించాయి. అంటే, ఈ మార్పులు ముందుగానే రోగం వచ్చే ప్రమాదాన్ని సూచించే అవకాశం ఉందని అర్థం. ఈ అధ్యయనాన్ని యూరప్‌లోని కొన్ని దేశాల్లో నిర్వహించారు. ఇందులో పార్కిన్సన్స్ ఉన్నవారు, GBA1 జన్యు వేరియంట్ ఉన్నవారు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నవారి డేటాను పోల్చారు. ఫలితాల్లో ఆశ్చర్యకరమైన తేడాలు బయటపడ్డాయి. రెండు గ్రూపుల మధ్య అనేక సూక్ష్మజీవాల రకాలు భిన్నంగా ఉన్నాయని గుర్తించారు. పేగులోని మైక్రోబయోమ్‌లో పెద్ద స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయని తేలింది. ఈ పరిశోధనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మార్పులు బయట లక్షణాలు కనిపించే ముందు నుంచే ప్రారంభమవుతాయని గుర్తించారు. అంటే, వ్యాధి మొదలయ్యే దశలోనే గుర్తించే అవకాశం ఉంది. ఇది వైద్య రంగానికి పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. ఇలా ముందుగానే గుర్తిస్తే, సరైన చికిత్సలు మరియు జీవనశైలి మార్పులతో వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చు. భవిష్యత్తులో పేగు ఆరోగ్యాన్ని పరిశీలించడం ద్వారా పార్కిన్సన్స్‌ను ముందే గుర్తించే అవకాశాలు పెరుగుతాయి.
0 Comments