Ad Code

ఒపెక్ నుంచి వైదొలిగిన యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ : మే 1 నుంచి అమల్లోకి

మురు ఉత్పత్తి దేశాల కూటమి ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్ కంట్రీస్ (ఒపెక్), ఒపెక్ ప్లస్ నుంచి వైదొలగుతున్నట్టు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ప్రకటించింది. ఇది మే 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇరాన్ యుద్ధం చారిత్రాత్మక ఇంధన సంక్షోభానికి కారణమై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచిన తరుణంలో యూఏఈ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఒపెక్, దానిని నడిపించే సౌదీ అరేబియాకు ఇది ఒక పెద్ద దెబ్బ. దీర్ఘకాలంగా సభ్యదేశంగా ఉన్న యూఏఈ బయటకు రావడం.. ఈ కూటమిలో గందరగోళాన్ని సృష్టించి, బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళిక రాజకీయాల నుంచి ఉత్పత్తి వరకు అనేక అంశాలపై సభ్యదేశాల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ఈ కూటమి ఐక్యంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఇంధన వ్యూహాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ఇంధన శాఖ మంత్రి సుహైల్ మొహమ్మద్ అల్-మజ్రూయీ రాయిటర్స్‌కు తెలిపారు. దీనిపై సౌదీ అరేబియాతో సంప్రదించారా? అని ప్రశ్నించగా.. మరే ఇతర దేశంతోనూ తాము ప్రస్తావించలేదని ఆయన సమాధానం ఇచ్చారు. ''ఇది ఒక విధానపరమైన నిర్ణయం, ఉత్పత్తి స్థాయికి సంబంధించిన ప్రస్తుత, భవిష్యత్ విధానాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత దీనిని తీసుకున్నాం'' అని ఇంధన శాఖ మంత్రి అన్నారు. ఇరాన్ బెదిరింపులు, నౌకలపై దాడుల కారణంగా ఒపెక్‌లోని గల్ఫ్ దేశాలు హర్మూజ్ జలసంధి గుండా తమ ఉత్పత్తులను రవాణా చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలోని ఐదో వంతు ఇంధనం, గ్యాస్ ఈ జల సంధి ద్వారానే రవాణా అవుతుంది. అయితే ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మాత్రం ఇది ఓ రకంగా విజయమే. ఎందుకంటే, చమురు ధరలను పెంచి ప్రపంచాన్ని ఒపెక్ దోచుకుంటోందని ఆయన ఆరోపిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు అందించే సైనిక మద్దతును అమెరికా అధ్యక్షుడు చమురు ధరలతో ముడిపెట్టారు. ఒపెక్ సభ్య దేశాలను అమెరికా రక్షిస్తుంటే.. వారు మాత్రం చమురు ధరలను విపరీతంగా పెంచి స్వార్థానికి వాడుకుంటున్నారని ట్రంప్ దుయ్యబట్టారు.

Post a Comment

0 Comments

Close Menu