Ad Code

రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం : ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన బాధితులు


గుజరాత్‌లోని భరూచ్ జిల్లా ఝగాడియా జీఐడీసీలోని 'మెట్రోపాలిటన్ ఎగ్జెక్మ్' అనే రసాయన కర్మాగారంలో ఏప్రిల్ 23న భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, చికిత్స పొందుతూ రాకేష్ వాసవతో సహా ఇద్దరు కార్మికులు మరణించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విషయంలో కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరుగుతున్న సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే చైతర్ వాసవ తన మద్దతుదారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. బాధితులకు భారీ పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఈ క్రమంలో మృతుడి బంధువు రోషన్ వాసవకు, ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చి, చైతర్ వాసవ, మృతుల కుటుంబ సభ్యులలో ఒకరు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఫ్యాక్టరీ గేటు వద్ద పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే చైతర్ వాసవ ఒక్కసారిగా రోషన్‌ను చెంపదెబ్బ కొట్టారు. దీనికి ప్రతిగా రోషన్ కూడా ఎమ్మెల్యేపై చేయి చేసుకున్నారు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయాల్సి వచ్చింది. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Post a Comment

0 Comments

Close Menu