తెలుగు గంగ ప్రాజెక్టు కింద చెన్నైకి సరఫరా చేస్తున్న కృష్ణా జలాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కృష్ణానది నుంచి తెలుగు గంగ కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటిని ఏపీ సరిహద్దు ప్రాంతమైన కండలేరులో నిల్వవుంచుతారు. అక్కడి నుండి తెలుగుగంగ కాలువ ద్వారా తిరువళ్లూరు జిల్లాలోని పూండి రిజర్వాయర్‌కు మళ్లిస్తారు. ప్రస్తుతం కండలేరు-పూండి మధ్య తెలుగుగంగ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం చేపట్టిన మరమ్మతుల కారణంగా కృష్ణాజలాల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. మరమ్మతులు ఈ నెలాఖరుకు పూర్తిచేశాక మే 1వ తేదీ నుంచి యథావిధిగా కృష్ణాజలాలను సరఫరా చేయనున్నట్లు ఏపీ అధికారులు హామీ ఇచ్చినట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖ తెలిపింది. చెన్నై నగరవాసులదాహార్తిని తీరుస్తున్న పూండి, చెంబరంబాక్కం, పుళల్, షోళవరం, కన్నన్‌కోట, తేర్వైకండిగై రిజర్వాయర్లలో ప్రస్తుతం 7,966 మిలియన్ ఘనపుటడుగుల నీటిని నిల్వవుంచినట్లు తెలిపారు. గత ఏడాది ఇదే రోజుకు నిల్వవుంచిన నీటిమమట్టం కంటే 36 మిలియన్ ఘనపుటడుగులు తక్కువని, ఈ వేసవి సీజన్‌లో తాగునీటి కొరత ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
0 Comments