Ad Code

చిన్నారుల అక్రమ రవాణా కేసు : హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు


చిన్నారులను అక్రమంగా రవాణా చేస్తున్న హైదరాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్స్‌లో గుజరాత్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన మురుగన్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సోదాలు చేపట్టారు. చిన్నారుల అక్రమ రవాణా కేసులో మురుగన్ గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా నవజాత శిశువులు, చిన్న పిల్లలను అపహరించి అక్రమంగా విక్రయించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్‌లో గత ఏడాది వరకు ఇటుకల బట్టిలో పని చేసిన మురుగన్, కేవలం ఒక్క ఏడాదిలోనే చైల్డ్ ట్రాఫికింగ్‌లో కింగ్‌పిన్‌గా ఎదిగాడు. గత ఏడాది చైతన్యపురి కేసులో మురుగన్ పేరు వెలుగులోకి వచ్చింది. మూడు నెలల పాటు జైల్లో ఉన్న అతడు జూలైలో విడుదలయ్యాడు. ఆపై దేశవ్యాప్తంగా చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. అతడి భార్య కృష్ణవేణి మరో గ్యాంగ్‌ను నడుపుతున్నట్టు గుజరాత్ పోలీసులు గుర్తించారు. ఈ మురుగన్ గ్యాంగ్ ఒక్క ఏడాదిలోనే 25 మంది చిన్నారులను విక్రయించినట్లు గుర్తించారు. ప్రస్తుతం మురుగన్ గ్యాంగ్ సభ్యులు గుజరాత్ పోలీసుల అదుపులో ఉన్నారు. వారి విచారణలో హైదరాబాద్‌కు సంబంధాలు బయటపడ్డాయి. మురుగన్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని మూడు ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్న గుజరాత్ పోలీసులు ఫెర్టిలిటీ సెంటర్లపై విచారణ చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu