తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో కలకలం రేపిన లంచం ఉదంతంపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్, సెటిల్‌మెంట్లు, వసూళ్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు నిజమని తాజా ఏసీబీ దాడులు నిరూపించాయి. బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ, ఏసీబీ విచారణలో దోషులుగా తేలిన సీఐ సరోజ, ఎస్‌ఐ రాణిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాండూరుకు చెందిన ఓ దంపతుల మధ్య ఉన్న కేసు విషయంలో నోటీసులు ఇచ్చేందుకు సీఐ సరోజ, ఎస్‌ఐ రాణి కలిసి రూ. 60,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు తాను అంత ఇవ్వలేనని చెప్పడంతో, చివరికి ఆ మొత్తాన్ని రూ. 40,000కు కుదించారు. మార్చి 23వ తేదీన పోలీసుస్టేషన్ ప్రాంగణంలోనే సీఐ సరోజ సమక్షంలో ఎస్‌ఐ రాణి బాధితుడి నుంచి రూ. 20,000ల లంచం తీసుకున్నారు. మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ, నేరం జరిగినట్లు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసింది. సీఐ బి. సరోజ,ఎస్‌ఐ హెచ్. రాణిలపై క్రిమినల్ మిస్‌కాండక్ట్ కేసు నమోదైంది. ఏసీబీ నమోదు చేసిన కేసు, శాఖాపరమైన ప్రాథమిక నివేదికల ఆధారంగా వీరినీ సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఈ ఒక్క కేసే కాకుండా, 498A (గృహ హింస) కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు, కౌన్సెలింగ్ పేరుతో దంపతుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు వీరిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. మహిళల సమస్యలను పరిష్కరించాల్సిన చోట ఇలాంటి అవినీతి జరగడంపై సామాన్య ప్రజలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
0 Comments