ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప సమీపంలో మార్చి 16న పోలీసులు ఒక మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో డోన్‌కు చెందిన పాలిష్ కట్టర్ విల్సన్‌గా నిర్ధారణ చేశారు. విల్సన్ హత్యకు గురైనట్లు తేలడంతో, దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. డోన్‌లోని బంగారయ్య కాలనీకి చెందిన పాలిష్ కట్టర్ విల్సన్, 11 సంవత్సరాల క్రితం నంద్యాలకు చెందిన మేరీ అలియాస్ రాశితో వివాహం అయింది. మూడేళ్లుగా భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి. విల్సన్ మద్యానికి బానిసై మేరీని తరచుగా కొట్టేవాడు. ఈ నేపథ్యంలో మేరీకి బాపూజీ నగర్‌కు చెందిన మధు అలియాస్ శంకర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విల్సన్‌ను హత్య చేసి పెళ్లి చేసుకోవాలని మేరీ, మధు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మధు తన స్నేహితులు రఫీ, అశోక్‌లను కూడా ఈ హత్యకు వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. విల్సన్ 15 రోజుల క్రితం డోన్‌కు వెళ్ళగా, మార్చి 15న మేరీ, మధు, రఫీ, అశోక్ ఆటోలో అక్కడికి చేరుకున్నారు. డోన్‌లో విల్సన్ కు మద్యం తాగించి, ఆటోలో ఎక్కించుకొని, రాయపాడుకు తీసుకెళ్లి చంపి కుందూ నదిలో పడేయాలని మొదట ప్లాన్ చేశారు. అయితే ప్లాన్ ప్రకారం అలానే చేసిన వాళ్ళు మార్గమధ్యలో మద్యం మత్తు వీడిన విల్సన్ వాళ్లతో గొడవపడ్డాడు. తనని ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అంటూ గొడవ చేసాడు. దీంతో కైప శివారుకు రాగానే వారు బెల్టుతో మెడకు బిగించి, రాళ్లతో తలపై కొట్టి విల్సన్‌ను అక్కడికక్కడే చంపారు. హత్య తర్వాత మృతదేహాన్ని గుర్తుపట్టకుండా కాల్చివేయాలని ప్రయత్నించి, రక్తపు మరకలున్న బట్టలను కుందూ నదిలో పారేసి పారిపోయారు. పోలీసులు మృతదేహాన్ని గుర్తించడంతో నిందితులు భయపడి కైప వీఆర్ఓ సమక్షంలో లొంగిపోయారు. ఈ కేసులో విల్సన్ భార్య మేరీతో పాటు మధు, రఫీ, అశోక్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన మేరీని కఠినంగా శిక్షించాలని విల్సన్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
0 Comments