ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సరుకులు డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ కిరాణా దుకాణదారుడు, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి భువనేశ్వర్‌లో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆమె, శుక్రవారం రాత్రి తన రూమ్‌మేట్ ఊర్లో లేని సమయంలో సమీపంలోని కిరాణా దుకాణం నుండి కొన్ని సరుకులను ఆర్డర్ చేసింది. సరుకులు ఇచ్చేందుకు వచ్చిన నిందితుడు, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి లోపలికి చొరబడి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలు శనివారం ఇన్ఫో వ్యాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(1), 62 కింద కేసులు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు, ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
0 Comments