రష్యా చమురు స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ వరుసగా డ్రోన్స్‌లతో దాడులకు తెగబడుతుంది. దీంతో 24కు పైగా ముడి చమురు నిల్వ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు రష్యా ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్రూడాయిల్‌. హర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడంతో క్రూడాయిల్‌ సరఫరాకు ఆటంకం తలెత్తి తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నయ మార్గంగా రష్యాపై కొన్ని దేశాలు దృష్టిసారించాయి. అయితే ఇప్పుడు రష్యా చమురు స్థావరాలు సైతం దాడులకు గురి కావడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న తుయాప్సే నగరంలోని రష్యా చమురు స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ దాడుల ప్రభావంతో యాసిడ్ వర్షం కురవడంతో పాటు గాలిలో బెంజీన్, గ్జైలీన్ వంటి విషవాయువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని తీర ప్రాంతంలో చేపలు, పక్షులు చనిపోయి పడి ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ గడిచిన 15రోజుల్లో రష్యా చమురు స్థావరాలే లక్షంగా మూడుసార్లకు పైగా దాడులు చేసినట్లు రష్యా పేర్కొంది. తొలిసారిగా ఏప్రిల్‌16న దాడులు జరుపగా మరోసారి ఏప్రిల్‌ 20 తేదీన దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇప్పటికే 24 చమురు నిల్వ ట్యాంకులు ధ్వంసమయ్యాయని పేర్కొంది. కీవ్ నగరానికి ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుయాప్సే రిఫైనరీ రష్యా చమురు ఎగుమతులకు అత్యంత ప్రధానమైనది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 12 మిలియన్ మెట్రిక్ టన్నులు సరాసరిన రోజుకు 240,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. రష్యా మొత్తం ఇంధన ఎగుమతి సామర్థ్యంలో సుమారు 12 శాతం వాటాను కలిగి ఉంది. ఇది రష్యాలోని టాప్ 10 రిఫైనరీలలో ఒకటి. రష్యా బడ్జెట్‌లో చమురు ఎగుమతులది సింహభాగం. దీనికి తోడు హర్ముజ్‌ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచం చూపు రష్యా చమురు వైపు మళ్లుతోంది. దీనివల్ల రష్యాకు ఊహించని లాభాలు కూడా చేకూరాయి. అల్ జజీరా ప్రకారం, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆకాశాన్నంటుతున్న ప్రపంచ చమురు ధరల కారణంగా, యుద్ధం మొదలైన మొదటి రెండు వారాల్లోనే రష్యా చమురు అమ్మకాల ద్వారా అదనంగా 672 మిలియన్ యూరోలు సంపాదించిందని 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్' అంచనా వేసింది. ఎగుమతి కోసం ఉద్దేశించిన చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలని ఉక్రెయిన్ భావిస్తోన్నట్లు విశ్లేషకుల అంచనా. అయితే ఈ దాడులతో దీనివల్ల ప్రపంచ చమురు కొరతను మరింత తీవ్రతరం చేస్తోందని రష్యా ఆరోపణలు చేస్తుంది.

Post a Comment

Previous Post Next Post