Ad Code

అల్జీమర్స్‌కు విరుగుడు కనిపెట్టేందుకు వంద మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించిన సామ్ ఆల్ట్‌మాన్


'అల్జీమర్స్' వ్యాధికి ఇప్పటివరకూ సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. అయితే కృత్రిమ మేధ (ఏఐ) ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయగలదని, అల్జీమర్స్ అంతానికి బాటలు వేస్తుందని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సంచలన ప్రకటన చేశారు.ఈ ప్రాణాంతక వ్యాధికి విరుగుడు కనిపెట్టేందుకు వంద మిలియన్ డాలర్ల(రూ. 845 కోట్లు) భారీ విరాళాన్ని ప్రకటించి, వైద్యరంగంలో సరికొత్త ఆశలు రేకెత్తించారు. అల్జీమర్స్ వ్యాధికి కారణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానాలను వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని 'టుడే'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆల్ట్‌మాన్ స్పష్టం చేశారు. మెడికల్ హిస్టరీలోని అత్యంత క్లిష్టమైన సమస్యల్లో అల్జీమర్స్ ఒకటని, సంక్లిష్టమైన డేటాను విశ్లేషించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో ఏఐ అద్భుతాలు చేయగలదని ఆయన తెలిపారు. ఈ వ్యాధికి సరైన మందును కనిపెట్టే దిశగా ప్రపంచాన్ని మరింత వేగంగా నడిపించే సత్తా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఉందన్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, అల్జీమర్స్ పరిశోధనలను ముమ్మరం చేసేందుకు ఓపెన్ఏఐ ఫౌండేషన్ తరపున $100 మిలియన్ల నిధులను ఆల్ట్‌మాన్ కేటాయించారు. ఇందుకోసం ప్రపంచ స్థాయిలోని ఆరు ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నారు. కొత్త డేటాను సృష్టించడం, సరికొత్త ఔషధాలను డిజైన్ చేయడం, అలాగే ఇప్పటికే ఆమోదం పొందిన మందులను ఈ వ్యాధిపై ఎలా ప్రయోగించవచ్చో తెలుసుకోవడం ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయం లక్షలాది బాధిత కుటుంబాలకు ఒక గొప్ప ఊరటనిస్తుందని అల్జీమర్స్ అసోసియేషన్ ప్రశంసించింది.

Post a Comment

0 Comments

Close Menu