దక్షిణ చైనాను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు


క్షిణ చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్వాంగ్జీ ప్రాంతంలోని ఖిన్జౌ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఖిన్జౌ నగరంలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రికార్డు స్థాయి వర్షపాతంతో అధికారులు అవాక్కయ్యారు. ఏప్రిల్ నెలలో ఈ స్థాయిలో వర్షం కురవడం నగర చరిత్రలో ఇదే తొలిసారి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద నీరు వేలాది ఇళ్లను, షాపులను, షోరూమ్‌లను ముంచెత్తింది. అండర్‌గ్రౌండ్ పార్కింగ్ స్థలాల్లోకి నీరు చేరడంతో వేలాది వాహనాలు నీట మునిగి పనికిరాకుండా పోయాయి. ఇళ్లలోకి ఛాతీ వరకు నీరు రావడంతో చాలామంది మేడలపై తలదాచుకుంటున్నారు. గాలివానలు, పిడుగుల భయం తోడవ్వడంతో స్థానిక ప్రభుత్వం ఖిన్జౌలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎత్తైన ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 150 మంది సిబ్బంది, 25 ఫైర్ ఇంజన్లు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 800 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక చోట చిక్కుకుపోయిన ముగ్గురు వృద్ధులను, ఇద్దరు పిల్లలను రెస్క్యూ టీమ్ సాహసోపేతంగా కాపాడింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది. ట్రైనింగ్ ఎఫెక్ట్ వల్ల ఈ విపత్తు సంభవించిందని వాతావరణ నిపుణులు అంటున్నారు. అంటే ఒకే ప్రాంతంపై పదేపదే తుపాను మేఘాలు కదలడం వల్ల కుండపోత వర్షం కురిసింది. ప్రస్తుతం నగరంలోని ప్రధాన వీధుల్లో వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ.. నివాస సముదాయాలు, గ్యారేజీల నుంచి నీటిని తోడివేసే ప్రక్రియ కొనసాగుతోంది. విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించడానికి అధికారులు శ్రమిస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org