Ad Code

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు


దేశ ఆర్థిక రంగంలో విశిష్ట గుర్తింపు పొందిన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకొన్నారు. ఈ అవార్డు ద్వారా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూల విధానాలు జాతీయ స్థాయిలో మరొకసారి గుర్తింపు పొందాయి. ముంబైలో నిర్వహించిన ఘన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఎకనామిక్ టైమ్స్ సంస్థ నిర్వహించే కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డులలో భాగంగా ఈ గౌరవం అందించారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబర్‌లోనే జ్యూరీ ఈ అవార్డుకు ఆయనను ఎంపిక చేయగా, తాజాగా జరిగిన వేడుకలో అధికారికంగా పురస్కారం అందించారు. సునీల్ భారతి మిట్టల్, సజ్జన్ జిందాల్, ఉదయ్ కోటక్, డాక్టర్ దేవి శెట్టి, అభిషేక్ మను సింఘ్వీ, నోయల్ టాటా వంటి ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక వృద్ధికి అనుకూలంగా రూపొందించిన విధానాలు, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'పై దృష్టి, పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు ప్రకటించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం చూపుతున్న చురుకుదనం జ్యూరీని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు పలు కీలక అంశాలను వెల్లడించారు. ఏప్రిల్ 28న విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గూగుల్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా విశేష పురోగతి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దేశం లక్ష్యంగా పెట్టుకున్న 500 గిగావాట్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే 90 గిగావాట్ల దిశగా అడుగులు వేసినట్లు వివరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన సంస్కరణలు, విజన్ 2020 వంటి కార్యక్రమాల వల్లే హైదరాబాద్ అభివృద్ధి సాధించిందని చంద్రబాబు గుర్తుచేశారు. మారుతున్న సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటేనే దేశం వేగంగా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu