Ad Code

నోవా గ్రూపు చైర్‌పర్సన్ విజయ నిర్మలపై కేసు నమోదు


నోవా గ్రూపు చైర్ పర్సన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ పై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం రాజేంద్ర నగర్ లో  నివసించే నోవా గ్రూపు చైర్‌పర్సన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ విజయ నిర్మల తన కుమార్తెకు పెండ్యాల కుటుంబంతో వివాహం కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో పెండ్యాల కుటుంబం ముందుగా కట్నం వద్దని చెప్పి, తర్వాత రూ.1 కోటి నగదు, బిఎండబ్ల్యు కారు, ఖరీదైన గిఫ్టులు, ఘనంగా వివాహ ఏర్పాట్లు కోరినట్లు ఆరోపించారు. వరుడి జీతం, భవిష్యత్ అవకాశాలపై తప్పుడు సమాచారం ఇచ్చి నమ్మబలికినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నిశ్చితార్థం, వివాహ ఏర్పాట్లపై భారీ ఖర్చు చేసిన తర్వాత, ఏప్రిల్ 5న ఒక్కసారిగా వివాహాన్ని రద్దు చేసి డబ్బులు, బహుమతులు తిరిగి ఇవ్వలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో తన కుమార్తె తీవ్ర మానసిక ఆందోళనకు గురైందని విజయనిర్మల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పెళ్లి కుమార్తె అక్షయ పెండ్యాలతోపాటు ఆమె తల్లి ఉష పెండ్యాల, తండ్రి సుధాకర్ పెండ్యాల, సోదరి క్రితి పెండ్యాలపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఇంటి వద్ద దాడి, ఆస్తి ధ్వంసం ఆరోపణలతో ఇదే వివాదానికి సంబంధించి జూబ్లీహిల్స్ నివసించే అక్షయ తండ్రి సుధాకర్ ప్రతిగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 24న విజయ నిర్మల తన కుమారుడు సహా సుమారు 70 మంది వ్యక్తులతో కలిసి తమ ఇంటికి వచ్చి గేటు పగులగొట్టి లోపలికి ప్రవేశించి వాచ్ మెన్ పై దాడి చేసి, ఇంటి సామగ్రి, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించారని, ఆయుధాలతో భయాందోళన సృష్టించారని పేర్కొన్నారు. సుధాకర్ ఫిర్యాదు మేరకు విజయనిర్మల, సుమేధ్ తదితరులపై జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 324(4), 329(4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu