Ad Code

ముగిసిన టీజీఎస్ ఆర్టీసీ సమ్మె


తెలంగాణాలో గత రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు శుక్రవారం అర్ధరాత్రి ముగిసింది. ఆర్టీసీ జేఏసీ ప్రధానమైన డిమాండ్లలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి, పది శాతం పీఆర్‌సీకి, గుర్తింపు సంఘం ఎన్నికలకు ఆర్టీసీ జేఏసీతో చర్చించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపింది. మిగిలిన సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం కూడా అంగీకరించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర్టీసీ మన కుటుంబం.. దురదృష్టవశాత్తు మన కుటుంబ వ్యక్తి దూరం కావడం బాధాకరం.. అని అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకున్నదన్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న విలీనంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది కూడా. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చల వివరాలను వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్, ఇతర అధికారుల బృందం ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపిందన్నారు. శుక్రవారం ఉదయం ఐఏఎస్‌లతో చర్చలు జరిపి తరువాత ఉప ముఖ్యమంత్రితో వారి సమస్యలపై, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే అంశాలపై అర్ధరాత్రి వరకు చర్చించినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. శనివారం మొదటి షిఫ్టు నుంచి బస్సులు యథాతథంగా నడుస్తాయన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ సంస్థ దేశంలోనే ప్రజా రవాణాలో ముందుండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి అధికారులు, కార్మిక నాయకులతో కలిసి అధికారిక కమిటీ ప్రకటించామన్నారు. పీఆర్సీపై అనేక అంశాలు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ వెసులుబాటు ఇరు పక్షాలు అర్థం చేసుకున్న తరువాత ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించింది.. మిగతా సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు చొరవ తీసుకొని పరిష్కారం చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించామన్నారు.

Post a Comment

0 Comments

Close Menu