బీజేపీలో చేరుతున్నట్లు ఎంపీ రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఎంపీలు ప్రకటించారు. ఈ పరిణామంతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. అయితే, ఈ పరిణామం తర్వాత పంజాబ్‌లోని ఆప్ కార్యకర్తలు మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్‌ను టార్గెట్ చేసుకున్నారు. పంజాబ్ ఆప్ ప్రభుత్వం ఆయనకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. దీనికి ముందు ఆయన ఇంటిపై ఆప్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పంజాబ్ ద్రోహి అంటూ ఇంటి గోడలపై నల్ల సిరాతో రాశారు. ఈ పరిణామాలు జరిగిన కొద్ది గంటలకే కేంద్ర ప్రభుత్వం హర్భజన్ సింగ్‌కు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. ఇకపై ఆయనకు ఢిల్లీలో, పంజాబ్‌లో కేంద్ర భద్రత లభిస్తుంది. ఆయనను రక్షించేందుకు సీఆర్పీఎఫ్ కమాండోలు మోహరించారు. హోం శాఖ వర్గాల ప్రకారం.. హర్భజన్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఇతర ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టర్, స్వాతి మాలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ జీత్ సహానీలకు కూడా కేంద్ర భద్రత కల్పించారు. వీరందరికి ఇకపై సీఆర్పీఎఫ్ భద్రత ఉంటుంది. ఆదివారం ఉదయం పంజాబ్ ప్రభుత్వం హర్భజన్‌కు ఉన్న జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. జలంధర్‌లో ఆయన నివాసం నుంచి సెక్యూరిటీ సిబ్బంది, ప్రభుత్వ వాహనాలను తొలగించారు. ఈ విషయాన్ని హర్భజన్ పీఏ మన్‌దీప్ సింగ్ ధ్రువీకరించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పార్టీని వీడిని ఎంపీలను ద్రోహులుగా అభివర్ణించారు.
0 Comments