ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి, అతని ఇంటిలోకి చొరబడి భార్య, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో కానిస్టేబుల్ భార్య, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ తన కుటుంబంతో కలిసి సొంతూరికి వెళ్లేందుకు టిక్కెట్లు కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో నిందితురాలు సరోజినీ భరద్వాజ్, దుర్గ్‌లోని ఆయన ఫ్లాట్‌కు చేరుకుని కానిస్టేబుల్ భార్య రీనా యాదవ్‌తో గొడవకు దిగింది, గొడవ బయటకు వినిపించకుండా టీవీ వాల్యూమ్‌ను పెంచిన సరోజినీ భరద్వాజ్, అనంతరం కత్తి తీసుకుని మొదట నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల కుమారుడు ఆదిత్యపై విచక్షణారహితంగా దాడి చేసింది. తర్వాత నిందితురాలు మిగిలిన ఇద్దరు కుమార్తెలు నైనా, తానియాపై దాడికి ప్రయత్నించగా, తీవ్రంగా గాయపడిన రీనా యాదవ్ తన బిడ్డలను వదిలేయమని ప్రాధేయపడింది. నిందితురాలి కాళ్లు పట్టుకుని తన కూతుళ్లను పారిపోమని కోరింది. దీంతో ఒక కుమార్తె బాత్‌రూమ్‌లో దాక్కుంది, మరొకరు బయటకు పరుగెత్తి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు. కేకలు విని పొరుగువారు వచ్చేసరికి నిందితురాలు రక్తంతో తడిసిన కత్తితో తలుపు దగ్గర నిలబడింది. స్థానికులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రికి తరలించే లోపే రీనా యాదవ్, ఆమె కుమారుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భరద్వాజ్, లలితేష్ యాదవ్ మధ్య సంబంధం ఉన్నట్లు తేలింది. శుక్రవారం కూడా ఆమె ఇంటికి రాగా, కానిస్టేబుల్ ఆమెను పంపించివేశారు. కానీ శనివారం ఆయన ఇంట్లో లేని సమయం చూసి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. నిందితురాలిని అరెస్టు చేశామని, ఈ ఘటనపై విచారణ చేపట్టామని పోలీసులు వెల్లడించారు.
0 Comments