వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ చేసిన ఆరోపణలపై కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు, సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నాగ రుక్మిణి శ్వేత కోట తీవ్రంగా స్పందించారు. తనపైనా, తన సంస్థపైనా రూ.10 కోట్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేశారంటూ, న్యాయవాది ఆర్.ఎం.వి. సుమంత్ ద్వారా యనమల నాగార్జున యాదవ్‌కు లీగల్ నోటీసులు పంపారు. భారత్, యూకే, యూరప్ లేదా ప్రపంచంలో మరెక్కడైనా తనకు గానీ, తన కంపెనీకి గానీ రూ.10 కోట్ల లావాదేవీలతో సంబంధం ఉందని నిరూపించే విశ్వసనీయ, ధృవీకరించదగిన డాక్యుమెంటరీ ఆధారాలను 48 గంటల్లోగా సమర్పించాలని ఆమె డిమాండ్ చేశారు. నవంబర్ 17న మధ్యాహ్నం 3 గంటల సమయంలో యనమల నాగార్జున యాదవ్ నిర్వహించిన విలేకరుల సమావేశం సాక్షి టీవీ లో ప్రత్యక్ష ప్రసారమైందని, ఆ తర్వాత సాక్షి టీవీ లైవ్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఆ సమావేశంలో రూ.1,00,000 పెట్టుబడితో ప్రారంభమైన తమ సంస్థ ద్వారా యూకే నుంచి భారత్‌కు నిధులు మళ్లించారంటూ అసత్య ప్రచారం చేశారని రుక్మిణి కోట అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి తమ సంస్థ మాజీ ఉద్యోగిని బోడపాటి ధరణి కృష్ణపై తామే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని , ప్రస్తుతం ఆ కేసు సీఐడీ దర్యాప్తులో ఉందని స్పష్టం చేశారు. ఈ కేసులో తాము బాధితులమే తప్ప, ఎటువంటి తప్పు చేసిన నిందితులం కాదని ఆమె తేల్చిచెప్పారు. ఈ నిరాధార ఆరోపణల వల్ల ఎన్నో ఏళ్ల నిబద్ధత, నిజాయతీతో తాను నిర్మించుకున్న వ్యక్తిగత గౌరవానికి, వృత్తిపరమైన ప్రతిష్టకు, కంపెనీ గుడ్‌విల్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని రుక్మిణి కోట ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైతే, రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ సివిల్ దావాతో పాటు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా, ఏ మీడియా వేదికల ద్వారా అయితే ఈ ఆరోపణలు చేశారో, అవే వేదికల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు, సాక్షి మీడియా నెట్‌వర్క్‌కు కూడా రుక్మిణి కోట కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో జరగబోయే న్యాయపరమైన ప్రక్రియల కోసం ఈ విలేకరుల సమావేశానికి సంబంధించిన అన్ని రికార్డింగ్‌లు, మెటీరియల్‌లను భద్రపరచాలని, ఆధారాలు లేని ఆరోపణలను ప్రసారం చేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలు కూడా ఇలాంటి నిరాధార ఆరోపణలను నమ్మి తప్పుదోవ పట్టవద్దని విజ్ఞప్తి చేసిన ఆమె.. వాక్ స్వాతంత్ర్యం పేరుతో తన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా పోరాడి తన సంస్థ ప్రతిష్టను కాపాడుకుంటానని స్పష్టం చేశారు.
3
Beranda
› Andhra Pradesh
› I Will Fight Legally to Protect My Company’s Reputation
› Legal Notices Issued to Yanamala Nagarjuna Yadav
› Says Rukmini Kota
› యనమల నాగార్జున యాదవ్‌కు లీగల్ నోటీసులు : చట్టపరంగా పోరాడి తన సంస్థ ప్రతిష్టను కాపాడుకుంటాను : రుక్మిణి కోటా
Subscribe to:
Post Comments (Atom)
