3

గాంధీ ఆసుపత్రిలో ఏడు రోజుల పసికందు అపహరణ : కొన్ని గంటల వ్యవధిలో కిడ్నాప్ మిస్టరీని ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఏడు రోజుల పసికందు అపహరణకు గురైన ఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఈ కేసును సవాలుగా తీసుకున్న సికింద్రాబాద్ పోలీసులు మెరుపు వేగంతో స్పందించి, కొన్ని గంటల వ్యవధిలోనే కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. చిన్నారిని అపహరించి లక్ష రూపాయలకు బేరం పెట్టి విక్రయించిన ఆరుగురు సభ్యుల ముఠాను కటకటాల వెనక్కి పంపారు. బీహార్‌కు చెందిన ఒక నిరుపేద మహిళ ఇటీవల ప్రసవం కోసం గాంధీ ఆసుపత్రిలో చేరి, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, మూడో కాన్పులోనూ ఆడబిడ్డే పుట్టడంతో కిడ్నాప్ ముఠా కన్ను ఆమెపై పడింది. ఆ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు.. “ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం వస్తుంది, ఆ డబ్బు మేము ఇప్పిస్తాం” అంటూ మాయమాటలతో నమ్మించారు. వారి మాటలు నిజమని నమ్మిన తల్లి ఏమరుపాటుగా ఉన్న సమయంలో, ఏడు రోజుల పసికందును ఎత్తుకెళ్లి లక్ష రూపాయలకు విక్రయించారు. ఆసుపత్రి నుంచి పసికందు మాయమైన విషయంపై సమాచారం అందుకున్న వెంటనే సికింద్రాబాద్ డీసీపీ రక్షితా మూర్తి రంగంలోకి దిగారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసుల పక్కా వ్యూహంతో కేవలం గంటల వ్యవధిలోనే నిందితులు చిక్కారు. ఈ ఘటనకు పాల్పడిన సరగడ హేమలత, షేక్ రిజ్వాన్, మహమ్మద్ నస్రీన్, మహమ్మద్ జానీ, షేక్ షమీనా బేగం, మహమ్మద్ ఇమ్రాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు ఇంకా ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? గతంలోనూ ఇలాంటి చిన్నారుల విక్రయాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Related Post

Previous
Next Post »