3

సెమీకండక్టర్ & డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0 ను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం : తిరుపతిలో 5,000 ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన సెమీకండక్టర్ & డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0 ను ప్రకటించింది. దేశంలో మరే ఇతర రాష్ట్రం అందించని విధంగా, సెమీకండక్టర్ ఫ్యాబ్ యూనిట్ల ఏర్పాటుకు ఏకంగా 80 శాతం వరకు మూలధన రాయితీ అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద అందించే సబ్సిడీకి 100 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. తద్వారా సిలికాన్ ఫ్యాబ్‌లకు 80 శాతం, అలాగే కాంపౌండ్, ఫోటోనిక్స్, సెన్సార్, డిస్‌ప్లే , అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్ యూనిట్లకు 70 శాతం రాయితీ లభించనుంది. ఒడిశా, తమిళనాడు , ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే అత్యధిక ప్రోత్సాహకాలు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నూతన విధానంలో భాగంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో 5,000 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ఏపీ సెమీకండక్టర్ పార్క్ ను అభివృద్ధి చేయనున్నారు. చిప్ డిజైన్ నుంచి తయారీ, ప్యాకేజింగ్ వరకు పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ ఒకే చోట ఉండేలా ఈ పార్క్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్లీన్‌రూమ్‌లు , నిరంతరాయ హై-వోల్టేజ్ విద్యుత్ సరఫరా, అల్ట్రా-ప్యూర్ వాటర్, స్పెషాలిటీ గ్యాసెస్, టెస్టింగ్ ల్యాబ్‌లు , లాజిస్టిక్స్ సదుపాయాలను కల్పించనున్నారు. అంతేకాకుండా, సెమికాన్ 2.0 కింద ఉన్న మొత్తం 10 విభాగాలకు ఈ పాలసీ వర్తిస్తుంది. స్టార్టప్‌లు, పరిశోధనా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ పాలసీలో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. చిప్ డిజైన్ రంగంలోకి వచ్చే స్టార్టప్‌లకు 22.5 కోట్ల వరకు సీడ్ ఫండింగ్ అందించడంతో పాటు, ఆర్ అండ్ డీ, టాలెంట్ ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ వ్యయంలో 25 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. అలాగే, ఐఐటీ తిరుపతి వేదికగా ఫోటోనిక్స్ రంగంపై ప్రత్యేక దృష్టితో కొత్త పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. పెట్టుబడిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సెమీకండక్టర్ గ్రోత్, ఇన్నోవేషన్ కౌన్సిల్ ' ద్వారా సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నారు. మరోవైపు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు తిరుపతి పార్క్‌లోనే ఏపీ సెమీకండక్టర్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో రూపొందించిన ప్రత్యేక పాఠ్యప్రణాళికతో శిక్షణ పొందే అభ్యర్థులకు 6 నెలల పాటు నెలకు 10,000 చొప్పున స్టైఫండ్ అందించనున్నారు. 

Related Post

Previous
Next Post »