3

భారత్ సమ్మిట్ కాంగ్రెస్ భావజాల ప్రచారానికేనా ?

హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ అంతిమ లక్ష్యం రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడం కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించడమేనన్న అభిప్రాయం బలపడుతోంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఒక గ్లోబల్ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తూ, నెహ్రూ-గాంధీల నాటి విదేశాంగ విధానాలను ప్రమోట్ చేయడమే ఈ సదస్సు వెనుక ఉన్న అసలైన రాజకీయ ఎజెండా. అయితే, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సైద్ధాంతిక ప్రచార సభలను నిర్వహించుకోవడం కొత్తేమీ కాకపోయినా.. తెలంగాణ ప్రజల పన్నుల సొమ్ముతో, ప్రభుత్వ ఖజానా నిధులతో అధికారికంగా రాహుల్ గాంధీ పీఆర్ వ్యాయామాన్ని నడపడమే ప్రధాన అభ్యంతరంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం ఏమిటంటే ఒక రాజకీయ, సైద్ధాంతిక సదస్సుకు పెట్టుబడుల సమ్మిట్ అనే కలరింగ్ ఇవ్వడమే. గత ఏడాది నిర్వహించిన సమ్మిట్‌కు రాహుల్ గాంధీ వచ్చినప్పుడే విపక్షాలు దీనిని రాజకీయ వేదికగా ఎండగట్టగా, ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్లీ అదే తప్పును పునరావృతం చేశారు. పెట్టుబడుల ముసుగు తీసేసి.. అంతర్జాతీయ వ్యవహారాల సదస్సుగానో లేక ప్రజాస్వామ్య సిద్ధాంతాల కాంక్లేవ్‌గానో ప్రచారం చేసి ఉంటే ప్రభుత్వానికి ఇంతటి రాజకీయ విమర్శలు చుట్టుముట్టేవి కావు. కానీ ప్రపంచ కార్పొరేట్ పెట్టుబడులు రప్పిస్తున్నామంటూ హడావుడి చేసి, లోపల మాత్రం కాంగ్రెస్ విదేశాంగ సిద్ధాంతాలు, 2029 రాజకీయ లక్ష్యాలపై డిబేట్లు పెట్టడం పాలనా వర్గాల్లోనూ, పారిశ్రామిక వర్గాల్లోనూ తీవ్ర అసహనానికి దారితీస్తోంది. ఇప్పుడు భారత్ సమ్మిట్‌కు అంటిన ఈ పక్కా పార్టీ ముద్ర .. త్వరలోనే ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన అసలైన పారిశ్రామిక వేదికపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఏర్పడింది. వచ్చే డిసెంబర్‌లో నిర్వహించబోయే అధికారిక ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై ఈ రాజకీయ వివాదం నీలినీడలు కమ్మేలా చేస్తోంది. సాధారణంగా దేశీయ, బహుళజాతి పారిశ్రామిక దిగ్గజాలు, కార్పొరేట్ సీఈవోలు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలతో సత్సంబంధాలు కోరుకుంటారు తప్ప, కేంద్రానికి పూర్తి వ్యతిరేకంగా, ఒకే పార్టీ అజెండాతో నడిచే రాజకీయ వేదికల్లో భాగస్వాములు కావడానికి జంకుతారు. ప్రభుత్వ సదస్సుల పేరిట రాహుల్ గాంధీ భావజాల ప్రచారం జరుగుతుంటే.. రేపు డిసెంబర్ సమ్మిట్‌కు హాజరైతే తమ కంపెనీలపై కూడా ఏదో ఒక పార్టీ ముద్ర పడుతుందేమోనన్న ఆందోళనలో ఇన్వెస్టర్లు పడే అవకాశం లేకపోలేదు. పరిశ్రమలను ఆకర్షించేందుకు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో సీఐఐ సహకారంతో పక్కా ప్రొఫెషనల్ ఎజెండాతో దూసుకుపోతున్న కీలక తరుణంలో.. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి అనవసర రాజకీయ వివాదాల్లో ఇరుక్కోవడం రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదన్న భావన ఉంది. రాజకీయాలు, పార్టీ భావజాలాలు వేరు.. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ప్రాణవాయువైన పారిశ్రామిక పెట్టుబడులు వేరు అన్న లక్ష్మణరేఖను పాలకులు గుర్తించకపోతే ప్రభుత్వ విశ్వసనీయతే దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Post

Previous
Next Post »