3

అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నీ : ఫైనల్ కు చేరిన భారత్

అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నీలో సెమీఫైనల్లో ఆప్ఘనిస్తాన్ ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరింది. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని(90 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 93) అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌తో శనివారం జరిగే ఫైనల్లో భారత్ తలపడనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో ఇరు జట్లు తలపడగా, పాకిస్థాన్ విజయం సాధించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకొని విజేతగా నిలవాలనే పట్టుదలతో భారత్ ఉంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 227 పరుగులు చేసింది. నోమన్ సలార్జాయ్(78 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51), షా ఫైజల్ రహిమి(72 బంతుల్లో 2 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. సోహైల్ ఖాన్(44 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 36 నాటౌట్) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్(3/43) మూడు వికెట్లు తీయగా.. ఆర్యన్ సవ్సాని(2/29) రెండు వికెట్లు పడగొట్టాడు. కావ్య పరేష్ పటేల్, యశ్‌బర్ధన్ చౌహన్, అర్జున్ రాజ్‌పుత్ తలో వికెట్ తీసారు. అనంతరం భారత్ 36.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ లక్య తృటిలో శతకం చేజార్చుకోగా.. ఆర్యవీర్ సెహ్వాగ్(57 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), వీకే వినీత్(62 బంతుల్లో 5 ఫోర్ల, సిక్స్‌తో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అలీ నైజాయ్(1/47), సోహైల్ ఖాన్(1/56) చెరో వికెట్ తీసారు. 228 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు లక్ష్య, ఆర్యవీర్ సెహ్వాగ్ దూకుడుగా ఆడారు. దాంతో తొలి పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. లక్ష్య 39 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. ఆర్యవీర్ సెహ్వాగ్ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 4 భారీ సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు.

Related Post

Previous
Next Post »