3

గెలాక్సీ ఎస్27 సిరీస్‌పై దృష్టి పెట్టిన శాంసంగ్

శాంసంగ్ తదుపరి తరం గెలాక్సీ ఎస్27 సిరీస్‌పై దృష్టి పెట్టింది. ఈ ఫోన్ల విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, వాటి కెమెరా వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో చర్చకు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ ఎస్26, ఎస్26 ప్లస్, ఎస్26 అల్ట్రా మోడళ్లను పరిచయం చేసిన సంస్థ, వచ్చే సిరీస్‌లో నాలుగు ఫోన్లను తీసుకురావచ్చని తాజా నివేదికలు చెబుతున్నాయి. వీటిలో కొత్తగా గెలాక్సీ ఎస్27 ప్రో మోడల్ కూడా ఉండొచ్చని సమాచారం. ముఖ్యంగా ప్రో, అల్ట్రా ఫోన్లలో కెమెరా మార్పులు కనిపించే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ క్లబ్ నివేదికల ప్రకారం. సాధారణ గెలాక్సీ ఎస్27, ఎస్27 ప్లస్ ఫోన్లలో కెమెరా వ్యవస్థలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఈ రెండు ఫోన్లలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించే అవకాశం ఉంది. ఇందుకోసం సోనీ IMX955 లేదా శాంసంగ్ సొంతంగా తయారు చేసిన S5KGNG సెన్సర్లలో ఒకదాన్ని ఉపయోగించవచ్చని సమాచారం. అల్ట్రా వైడ్ కెమెరా 12 మెగాపిక్సెల్స్‌తో ఉండనుంది. దీనికి సోనీ IMX564 సెన్సర్‌ను అమర్చవచ్చని అంచనా. గెలాక్సీ ఎస్23 సిరీస్ నుంచి ఇదే సెన్సర్‌ను శాంసంగ్ ఉపయోగిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 3x టెలిఫోటో కెమెరా కోసం శాంసంగ్ S5K3K1 సెన్సర్‌ను వాడే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం మాత్రం శాంసంగ్ S5K3LU, సోనీ IMX874 సెన్సర్లను సంస్థ పరీక్షిస్తున్నట్లు సమాచారం. గెలాక్సీ ఎస్27 ప్రో, ఎస్27 అల్ట్రా మోడళ్లలో కెమెరా సామర్థ్యం మరింత మెరుగుపడవచ్చని లీకులు చెబుతున్నాయి. ఈ రెండు ఫోన్లలో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించవచ్చని తెలుస్తోంది. దీనికి శాంసంగ్ S5KHP6 సెన్సర్‌ను ఉపయోగించవచ్చని అంచనా. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కోసం శాంసంగ్ S5KJN3 లేదా సోనీ IMX855 సెన్సర్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చని సమాచారం. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు శాంసంగ్ S5K2P5 సెన్సర్ ఉండొచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు మోడళ్ల మధ్య ప్రధాన తేడా టెలిఫోటో కెమెరాలో ఉండనుంది. ఎస్27 ప్రోలో 3x టెలిఫోటో కెమెరాను ఇవ్వవచ్చని, దీనికి గెలాక్సీ ఎస్26 అల్ట్రాలోనూ ఉపయోగించిన S5K3LD సెన్సర్‌ను అమర్చవచ్చని సమాచారం. మరోవైపు ఎస్27 అల్ట్రాలో 5x టెలిఫోటో కెమెరా ఉండొచ్చు. దీనికి సోనీ IMX855 లేదా శాంసంగ్ S5KJN3 సెన్సర్లలో ఒకదాన్ని ఉపయోగించే అవకాశం ఉంది. అంటే అల్ట్రా మోడల్‌లో ప్రత్యేకమైన 3x కెమెరాను తొలగించి, కొత్త ప్రో మోడల్‌లో ఆ సదుపాయాన్ని అందించవచ్చన్నది లీకుల సారాంశం. అయితే ఈ వివరాలపై శాంసంగ్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

Related Post

Previous
Next Post »