ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ సమీపంలోని తాడిమెరక రీడ్రిల్లింగ్ పాయింట్ వద్ద మంగళవారం ఉదయం సంభవించిన గ్యాస్ బ్లో అవుట్ ను అధికారులు, నిపుణులు సాయంత్రానికి పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం, ఓఎన్జీసీ బృందాలు సమన్వయంతో పనిచేయడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గెద్దాడ సమీపంలోని గ్యాస్ బావి వద్ద మరమ్మతు పనులు జరుగుతుండగా ఇవాళ తెల్లవారుఝామున సుమారు 5 గంటల సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై బ్లో అవుట్ సంభవించింది. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన ఓఎన్జీసీ సిబ్బంది రాజమండ్రిలోని విపత్తు నిర్వహణ బృందానికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని వెల్ కంట్రోల్ చర్యలను ముమ్మరం చేశారు. గ్యాస్ లీకేజీ సమాచారం తెలియగానే సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తక్షణమే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్ లీకేజీని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేంత వరకు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, ఓఎన్జీసీ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్త చర్యగా గ్యాస్ బావి చుట్టూ 500 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని దిగ్బంధించి, సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జాతీయ రహదారి 216 పై వాహనాల రాకపోకలను నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు, బావి చుట్టూ నిరంతరం నీటిని వెదజల్లుతూ వాటర్ బ్లాంకెట్ ఏర్పాటు చేశారు. రాజమండ్రి నుండి వచ్చిన ఓఎన్జీసీ ప్రత్యేక నిపుణుల బృందం ఎంతో శ్రమించి, బావిలోకి ప్రత్యేక బురదను పంప్ చేసి, షియర్ ర్యామ్ ఏర్పాటు చేయడం ద్వారా సాయంత్రానికి గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టింది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
3
Beranda
› Andhra Pradesh
› Dr. B.R. Ambedkar Konaseema district
› Gas Blowout at Mamidikuduru Brought Fully Under Control
› Tadimeraka re-drilling point
› పూర్తిగా అదుపులోకి వచ్చిన మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్
Subscribe to:
Post Comments (Atom)
