3

వృద్ధ దంపతులు డిజిటల్ అరెస్ట్ : రూ.2 కోట్లు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో  డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంపతులు మక్కుపాటి బాలకృష్ణ, ఆయన భార్య చలసాని నళిని దేవిలను భయభ్రాంతులకు గురిచేసిన సైబర్ నేరగాళ్లు వారి నుంచి ఏకంగా రూ.2 కోట్లు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి సంపాదించిన సొమ్మును నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులమంటూ ఫోన్ చేసిన మోసగాళ్లు అసత్య ఆరోపణలతో దంపతులను భయపెట్టి, చివరకు వారి పెట్టుబడులను తమకు బదిలీ చేయించుకున్నారు. గత నెల 20న సందీప్ రావు అనే వ్యక్తి బాలకృష్ణ దంపతులకు ఫోన్ చేశాడు. తాను బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. అనంతరం నళిని దేవిపై తమ పోలీస్ స్టేషన్‌లో 17 కేసులు నమోదయ్యాయని చెప్పాడు. కొంతమంది యువతుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, నళిని దేవి యువతులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారి నగ్న చిత్రాలను తీసి ఇతరులకు పంపించారని ఆరోపించాడు. ఈ విషయంపై విచారణ జరపాల్సి ఉందని, వెంటనే బెంగళూరుకు రావాలని ఆదేశించాడు. ఈ ఆరోపణలు విన్న వృద్ధ దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమకు అలాంటి వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నిందితులు వినిపించుకోలేదు. వృద్ధ దంపతులు ప్రయాణం చేయలేమని చెప్పడంతో సందీప్ రావు తన పైఅధికారి రాహుల్ చౌదరితో మాట్లాడిస్తానని చెప్పాడు. అనంతరం ఇన్‌స్పెక్టర్‌గా పరిచయం చేసుకున్న రాహుల్ చౌదరి ఫోన్‌లోకి వచ్చి వారిని మరింతగా బెదిరించాడు. నళిని దేవిపై కేసులు నమోదయ్యాయని, సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని నమ్మించాడు. ఇందుకు సంబంధించిన పత్రం అంటూ ఒక నకిలీ వారెంట్ కాపీని వాట్సాప్‌లో పంపించాడు. అంతేకాకుండా, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని చెప్పి దంపతులను మానసికంగా ఒత్తిడికి గురిచేశారు. ఫోన్‌లోకి మరో మహిళను తీసుకొచ్చి ఆమెతోనూ అరెస్టు చేస్తామని బెదిరించారు. మోసగాళ్లు వేసిన పథకంలో భాగంగా దంపతుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బును తమకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు బదిలీ చేయకపోతే అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన బాలకృష్ణ దంపతులు తమ బ్యాంకు ఖాతాను మూసివేసి, అందులో ఉన్న నిధులను గత నెల 31న విజయవాడ గాంధీనగర్ శాఖలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశారు. సుమారు రెండు రోజుల పాటు విచారణ జరుగుతుందని, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొత్తం డబ్బును తిరిగి వారి ఖాతాలోనే జమ చేస్తామని నిందితులు నమ్మబలికారు. అయితే డబ్బులు బదిలీ చేసిన తర్వాత నిందితుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో తాము మోసపోయి తాము రూ.2 కోట్లు కోల్పోయామని గుర్తించిన బాధితులు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ అధికారుల సూచన మేరకు తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తాడేపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్రబాబు తెలిపారు. డబ్బులు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, నిందితుల వివరాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related Post

Previous
Next Post »