3

ప్రజా పోరాటంతో మద్యం దుకాణానికి శాశ్వతంగా తాళం : టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్థులు

తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన తిరుపత్తూరు సమీపంలోని తిరుక్కలాపట్టి గ్రామంలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని అధికారులు తాజాగా శాశ్వతంగా మూసివేశారు. ఈ నిర్ణయంతో గ్రామమంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. గ్రామంలోని పాఠశాల విద్యార్థులు, మహిళలు, రైతుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానికులు ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. గ్రామంలో మద్యం దుకాణం ఉండటం వల్ల ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ దాన్ని మూసివేయాలని అధికారులను కోరుతూ వచ్చారు. గ్రామస్థుల నిరంతర పోరాటం, వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు చివరకు దుకాణాన్ని మూసివేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తాజాగా మద్యం దుకాణానికి శాశ్వతంగా తాళం వేశారు. దీంతో తమ ఏళ్ల నాటి పోరాటం ఫలించిందని సంతోషించిన గ్రామస్థులు ఒకచోట చేరి సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలంతా ఐక్యంగా నిలబడి నిరంతరం పోరాడితే తమ సమస్యలకు పరిష్కారం సాధించుకోవచ్చని ఈ గ్రామస్థులు నిరూపించారంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Post

Previous
Next Post »