3

రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేయడమే భారత్ సమ్మిట్ ప్రధాన ఉదేశ్యం

తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేయడమే భారత్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ వాతావరణం పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాల్లో కర్టెన్ రైజర్ కార్యక్రమాలు నిర్వహించామని సీఎం తెలిపారు. త్వరలో ముంబై, అహ్మదాబాద్‌లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 13, 14 తేదీల్లో జరిగే భారత్ సమ్మిట్‌కు 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. భారత్ సమ్మిట్‌కు ఆహ్వానించిన కొంతమందికి తొలుత అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు వాటిని నిరాకరించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వివిధ రంగాలకు చెందిన వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులను ఈ సమ్మిట్‌కు ఆహ్వానించామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ప్రత్యక్షంగా చూసి, రాష్ట్ర పారిశ్రామిక విధానాలను తెలుసుకునే అవకాశం కల్పించడమే ఈ సదస్సు నిర్వహణ వెనుక ఉద్దేశమని వివరించారు. తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని సీఎం విమర్శించారు. కిషన్ రెడ్డి, రాంచందర్ రావు, కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడులను ఆహ్వానించి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు వంటి అంశాల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. వారు వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ పార్టీని కాదని, తెలంగాణ ప్రజలను అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి గిగ్ వర్కర్లను ఆదుకునే ఆలోచన లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. గిగ్ వర్కర్ల చట్టాన్ని రేపటి నుంచి అమలు చేయబోతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా గిగ్ వర్కర్ల పాలసీ అమలును ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత్ సమ్మిట్‌లో ముగింపు సందేశం ఇచ్చేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారని చెప్పారు. ప్రధాని మోడీ ఇతర దేశాలకు వెళ్లి ఉపన్యాసాలు ఇస్తారని, విదేశాల్లో సదస్సులు నిర్వహిస్తారని.. కానీ రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తే బీజేపీ విమర్శలు చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ ఏది చేసినా కరెక్ట్.. రాహుల్ గాంధీ చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందని నిలదీశారు. బీజేపీ వైఖరి నియంతృత్వ ధోరణిలో ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. సుపరిపాలన కోసం రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 106 సార్లు సవరించుకున్నామని గుర్తుచేశారు. ప్రపంచ శాంతి కోసం చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతి అతిథి తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు విజ్ఞత ప్రదర్శించాలని రేవంత్ రెడ్డి సూచించారు. మీకు కడుపులో విషం ఉండొచ్చు.. కానీ దాన్ని తెలంగాణ ప్రజలపై ప్రదర్శించవద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ బీజేపీని ఓడించి దేశానికి ప్రధానమంత్రి అవుతారనే భయం బీజేపీ నేతల్లో ఉందని విమర్శించారు. తమ రాజకీయాల కోసం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకించవద్దని హితవు పలికారు. ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వచ్చినప్పుడు స్వాగతించారని, కానీ భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ వస్తుంటే విమర్శలు చేయడం ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Related Post

Previous
Next Post »